విఐపి ప్రోటోకాల్‌తో సామాన్యులకు పాట్లు..!-public suffers with vvip protocol culture in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విఐపి ప్రోటోకాల్‌తో సామాన్యులకు పాట్లు..!

విఐపి ప్రోటోకాల్‌తో సామాన్యులకు పాట్లు..!

HT Telugu Desk HT Telugu
May 16, 2022 02:32 PM IST

ఏ చట్టం అనుమతించిందో, ఏ రూల్‌ బుక్‌లో పేర్కొన్నారో తెలీదు కానీ వివిఐపి కల్చర్‌ సామాన్యులకు నరకం చూపిస్తోంది. ముఖ్యనేతలు మొదలుకుని మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు సామాన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తోంది.

<p>ట్రాఫిక్ ఆంక్షలతో విజయవాడ వారధి సమీపంలో నిలిచిపోయిన వాహనాలు</p>
ట్రాఫిక్ ఆంక్షలతో విజయవాడ వారధి సమీపంలో నిలిచిపోయిన వాహనాలు

మండే ఎండల్లో అయినా, జోరు వాన కురుస్తున్నా విఐపి మూమెంట్ ఉందని తెలిస్తే చాలు ట్రాఫిక్‌ ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. విజయవాడ నగరంలో అయితే ఈ సమస్య రోజురోజుకు తీవ్రమైపోతోంది. ముఖ్యమంత్రి, గవర్నర్‌, డిజిపిలు రోడ్ల మీదకు వస్తే చాలు ట్రాఫిక్ ఆంక్షలు మొదలవుతాయి. వారు ఇంటి నుంచి బయటకు రావడానికి గంట ముందే ట్రాఫిక్ ఆంక్షలు మొదలవుతాయి. వెళ్లిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. ఉన్నతాధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు ఆ మార్గంలో మరో వాహనం వెళ్లడానికి వీలుండదు.

దేశరాజధానిలో కూడా ఉండదీ హడావుడి....

దేశరాజధాని ఢిల్లీలో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎలాంటి ఎస్కార్ట్ లేకుండా ఒక్క వాహనంలోనే ఇళ్ల నుంచి కార్యాలయాలకు వెళ్లొస్తుంటారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువు దీరే ప్రాంతంలో ప్రధాని, రాష్ట్రపతికి తప్ప మిగిలిన వారికి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే ప్రయాణాలు సాగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బుగ్గకార్లపై సుప్రీం కోర్టు నిషేధం విధించిన తర్వాత ఒకటికి నాలుగు కార్లు ముందు వెనుక చేర్చి కాన్వాయ్‌లలో వెళ్లే హడావుడి ఎక్కువైపోయింది. దీనికి సింపుల్‌గా భద్రతా కారణాలు చెబుతారు. ప్రజల్లో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు భద్రత లేకుండా బయటకు రారు. ముందో ఎస్కార్ట్, వెనుకో ఎస్కార్ట్ వేసుకుని పోలీస్ సైరన్‌ మోగించుకుంటూ రోడ్లపై సాగుతుంటారు.

అధికారులేం తక్కువ కాదు....

మంత్రులు, ప్రజాప్రతినిధులే కాదు అధికారులు కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా పోలీస్‌ శాఖ అధికారులైతే రెండు మూడు వాహనాలకు తగ్గకుండా కాన్వాయ్‌గా వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రాజేంధ్రనాధ్‌ రెడ్డి ఆ బాధ్యతలు స్వీకరించక ముందు తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లో సొంతింట్లో ఉండేవారు. డిజిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయవాడ మకాం మార్చారు. అధికారిక నివాసంలో ఉంటున్నారు. ప్రతి రోజు ఉదయం నిర్ణీత సమయానికి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి బయల్దేరి వెళ్తారు. ఒక్కో సారి మధ్యాహ్నం భోజన విరామానికి ఇంటికి వస్తుంటారు. తిరిగి సాయంత్రం కార్యాలయానికి వెళ్తారు. ఆయన వెళ్లి వచ్చే సమయంలో విజయవాడ బందరు రోడ్డు మొదలుకుని, చెన్నై-కోల్‌కత్తా హైవే వరకు ట్రాఫిక్ నిలిపివేస్తుంటారు. 

విజయవాడ నగరం నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే మార్గాన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణంగా చాలాకాలం క్రితం మూసేశారు. విఐపిలు వెళ్లడానికి మాత్రం ప్రత్యేకంగా గేట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన వ్యక్తుల రాకపోకల పేరుతో రోజులో కనీసం ఐదారు సార్లు ట్రాఫిక్ నిలిపి గేట్లు తెరుస్తుంటారు. ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర ముఖ్యమైన వ్యక్తులు జాతీయ రహదారిపైకి వెళ్లే సమయంలో వాటిని ఓపెన్ చేస్తుంటారు. అధికారులు ప్రత్యేకంగా రోడ్లపైకి వచ్చే సమయంలో ఆ మార్గంలో కనీసం ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించకుండా కఠిన ఆంక్షలు విధిస్తుంటారు. సాధారణ జనం మాత్రం రెండు కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. గత రెండు మూడేళ్ళలో ఈ తరహా విఐపి కల్చర్‌ విపరీతంగా పెరిగిపోవడంపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎండా, వానలతో సంబంధం లేకుండా అధికార దర్పాన్ని చూపించుకోవడం కోసం జనాన్ని ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలున్నాయి.

ఇక ముఖ్యమంత్రి, గవర్నర్‌ విమానాశ్రయానికి ప్రయాణించాలంటే గ్రీన్‌ ఛానల్ ఏర్పాటు చేస్తుంటారు. ఆ సమయంలో రోడ్లపై ఉన్నవారికి నరకం తప్పదు. గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుంటాయి. అదే సమయంలో వందల కొద్ది పోలీసు సిబ్బంది రోడ్ల మీద పడిగాపులు పడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వెళ్లినా, సెక్రటేరియట్‌కు వెళ్లినా, శాసనసభా సమావేశాలు నిర్వహించే సమయంలో పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి మామూలు నరకం ఉండదు. ప్రముఖుల భద్రత పేరుతో ఆంక్షలతో రోడ్లపై తరచూ ట్రాఫిక్‌ నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా పోలీసులు మాత్రం భద్రతాపరమైన చర్యల్లో భాగమని సమర్ధించుకుంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం