AP Ration Shops : రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ
17 June 2024, 21:48 IST
- AP Ration Shops : ఏపీ కొత్త ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. వచ్చే నెల 1 నుంచి రేషన్ కార్డుదారులందరికీ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
AP Ration Shops : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు. తాజాగా బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో కొంత కాలం కందిపప్పు పంపిణీ చేసినా... ఆ తర్వాత నిలిపివేశారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. సత్వరమే కందిపప్పు సరఫరాకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారు. ఈనెల 20 నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం, కందిపప్పు, ఆయిల్, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది. జులై 1 నుంచి బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ చేయనున్నారు.
రేషన్ సరుకుల్లో అవకతవకలు
పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ఇటీవల తెనాలిలోని రేషన్ గోదాములలో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని అవకతవకలను ఆయన గమనించారు. ప్యాకింగ్ చేసిన పంపిణీ చేస్తున్న పంచదార, కందిపప్పు, నూనె వంటి వాటిల్లో ప్యాకెట్‌కు 50 నుంచి 100 గ్రాములు తక్కువ బరువు ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ గుర్తించారు. అనంతరం మంగళగిరిలో తనిఖీ చేయించగా అక్కడ కూడా ప్యాకెట్ల తూకం తక్కువగా ఉందని తేలింది. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచదార, కందిపప్పు, నూనె ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆదేశించారు. కొలతలు సరిచేసి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా పరిమాణం తగ్గించారా? అనే దానిపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
రేషన్ దుకాణాల వద్దే పంపిణీ
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని వ్యవస్థల్లో మార్పులు చకచక చేస్తున్నారు. ఇక నుంచి రేషన్ షాపుల వద్దే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రేషన్ డీలర్ల కమిషన్ పెంచేందుకు కూడా సమీక్షలు చేస్తున్నారు. దీంతో పాత పద్దతినే అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తొలుత రాష్ట్రంలో రేషన్ షాప్‌ల వద్ద రేషన్ ఇచ్చేవారు. రేషన్ డీలర్లు కమిషన్ ప్రాతిపదికన దుకాణాలను నిర్వహించేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటింటికీ రేషన్ వ్యవస్థ తీసుకొచ్చారు. రేషన్ డీలర్లకు లబ్దిదారులకు మధ్య మొబైల్ డెలివరీ యూనిట్లను నెలకొల్పారు. రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని మొబైల్ డెలివరి యూనిట్లలో తరలించి కార్డు దారులకు పంపిణీ చేసేవారు.
ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. దీంతో గతంలోనే టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే రేషన్ షాపుల వద్దే రేషన్ ఇచ్చే పాత వ్యవస్థను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇంటింటికీ రేషన్ పథకాన్ని రద్దు చేసి, పాత రేషన్ షాపుల వ్యవస్థే అమలుచేయనున్నారని సమాచారం. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే రేషన్ డీలర్ల కమిషన్ కూడా పెంచేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుంది. రేషన్ దుకాణాలు, మొబైల్ డెలివరీ యూనిట్లతో బియ్యం మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు.