Wheat Flour In Ration : రేషన్‌లో ఇకపై గోధుమ పిండి…
Wheat Flour In Ration రేషన్ దుకాణాల ద్వారా గోధుమ పిండిని అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. గోధుమ పిండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా గోధుమ పిండిని సబ్సిడీ ధరలకే అందించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోధుమ పిండి విక్రయాలను ప్రారంభించిన మంత్రి, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో విక్రయాలు జరుపుతామని ప్రకటించారు.
Wheat Flour In Ration ఆంధ్రప్రదేశ్ రేషన్ దుకాణాల్లో ఇకపై ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ పిండిని విక్రయించనున్నారు. కిలో గోధుమ పిండిని రూ.16లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ లో గోధుమ పిండి విక్రయాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ తాజాగా గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖ పట్టణం లో ప్రారంభించారు.నగరంలోని లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు.
ఒక్కో కార్డు పై రెండు కిలోల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని మంత్రి లబ్దిదారులకు అందించారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు బాగుందని ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర పిడిఎస్ కార్యదర్శి మెచ్చుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40/- గా ఉండగా సబ్సిడీ ధరకే నాణ్యమైన గోధుమ పిండిని అందించనున్నారు.
విశాఖపట్నం అర్బన్ ఏరియాలో రేషన్ కార్డు దారులకు యం. డి.యు. వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. ఉత్తరాంధ్రలోని 6,94,755 కార్డు దారులకు ప్రస్తుతం గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని, ఒక్క విశాఖపట్నం జిల్లాలో 4,54,485 కార్డుదారులకు పంపిణీ చేయనున్నామని లబ్ది దారులు ఈ అవకాశం వినియోగించు కోవాలని కోరారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో కూడా గల కార్డు దారులకు సబ్సిడీ పై గోధుమపిండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.