Aadhaar Ration Card Link : రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్-ఆధార్ లింక్ ఈకేవైసీ గడువు పెంపు
Aadhaar Ration Card Link : రేషన్ కార్డుతో ఆధార్ లింగ్ ఈకేవైసీ అప్డేట్ గడువులు మరో మూడు నెలలు పెంచుతున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో రేషన్ కార్డుదారులకు కాస్త ఉపశమనం లభింంచింది.
Aadhaar Ration Card Link : ఆధార్-రేషన్ కార్డు లింక్ పై కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఆధార్-రేషన్ కార్డు లింక్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది. జూన్ 30తో ఉన్న గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, విద్య, వైద్య పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం. వైట్ రేషన్ కార్డుదారులను ప్రభుత్వ పథకాలకు అర్హులుగా తీసుకుంటారు. అయితే రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్-రేషన్ కార్డులను లింక్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది. రేషన్ డీలర్లు ఈ ప్రక్రియను చేపట్టారు.
జూన్ 30 లోగా రేషన్ కార్డులను ఆధార్ లతో అనుసంధానం చేసుకోవాలని గడువు విధించింది. ఇప్పటికే ఈ గడువును పలుమార్లు పడిగించిన కేంద్రం తాజాగా... మరోసారి పొడిగించింది. మరో మూడు నెలలు అనుసంధాన ప్రక్రియ గడువును పొడిగించింది. ఆధార్ -రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టొచ్చని కేంద్రం భావిస్తోంది.
ఆధార్-రేషన్ కార్డు లింక్ ఎలా?
రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో ఆధార్-రేషన్ కార్డు అనుసంధానం చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో ద్వారా వీటిని లింక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లో కూడా అనుసంధానం చేసే వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ పోర్టల్‌కు వెళ్లి.. ఆధార్-రేషన్ కార్డు లింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మీ మొబైల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.
ఆధార్ కేంద్రాల వద్ద క్యూ
సాంకేతిక కారణాల వల్ల రేషన్ కేంద్రాల్లో చాలా మందికి ఈకేవైసీలో సమస్యలు వస్తున్నాయి. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడమే ఈ సమస్యలు వస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు. ఏడు నెలలుగా రాష్ట్రంలో ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టినా ఇంకా 100 శాతం పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. ఆధార్ సమస్యల వల్ల కేవైసీ అప్ డేట్ ఆలస్యం ఉందని, జనాలు ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండడంతో జనాలు ఈ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు.
త్వరలో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీపై ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటన చేశారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ, పింఛన్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర ప్రభుత్వ పథకాలు ముడిపడి ఉన్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూడు నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. దీంతో సామాన్యులకు డబ్బు ఆదా అవుతుందన్నారు.
సంబంధిత కథనం