TG New Ration Cards : కోడ్ ముగియగానే శుభవార్త - తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన-new ration cards will be sanctioned as soon as the election code is lifted in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg New Ration Cards : కోడ్ ముగియగానే శుభవార్త - తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

TG New Ration Cards : కోడ్ ముగియగానే శుభవార్త - తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
May 29, 2024 11:24 AM IST

Telangana New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే… ఆ దిశగా అడుగులు పడనున్నాయి.

త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

Telangana New Ration Cards Updates: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా ఏళ్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో...తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట కొత్త రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని పేద ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ కంటే ముందే కొత్త కార్డుల జారీ ఉంటుందని అంతా భావించినప్పటికీ…అలా జరగలేదు. పైగా ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. దీంతో సంక్షేమంతో పాటు పలు కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి.

రాష్ట్రంలో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగియగా… జూన్ 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఇక తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు జూన్ 5వ తేదీన వెల్లడి కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం కూడా పెండింగ్ లో ఉంది. ఇవన్నీ పూర్తి కాగానే…. ఎన్నికల కోడ్ పై ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉంది.

మంత్రి పొంగులేటి ప్రకటన….

ఎన్నికల కోడ్ ముగిసేందుకు సమయం కూడా దగ్గరపడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం పలు అంశాలపై ఫోకస్ పెట్టింది. రుణమాఫీతో పాటు రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు స్కీమ్ లను పట్టాలెక్కించాలని భావిస్తోంది. రుణమాఫీకి డెడ్ లైన్ కూడా ఫిక్స్ కావటంతో మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను షురూ చేయాలని చూస్తోంది.

రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్విట్టర్(X)లో కీలక ప్రకటన చేశారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఎప్పటి నుండో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించి… అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేయటం జరుగుతుందని స్పష్టం చేశారు.

మారనున్న రేషన్ కార్డుల రూపం….!

 తెలంగాణలోని ఆహార భద్రత కార్డుల రూపం త్వరలో మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమచారం. 

తెలంగాణ వ్యాప్తంగా 89.98 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక చిన్న పుస్తకం తరహాలో రేషన్‌ కార్డులు ఉండేవి. కుటుంబ యాజమాని పేరుపై కార్డు జారీ చేశారు. కార్డులు కుటుంబ సభ్యుల ఫొటో, పూర్తి వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటిస్థానంలో రైతు బంధు పాస్‌బుక్‌ సైజ్‌లో రేషన్‌ కార్డులు అందించారు. ఈ కార్డుల్లో ముందువైపు కుటుంబ సభ్యుల ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. వెనుక భాగంలో చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. అయితే అనంతరం ఆ తర్వాత రేషన్‌ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు జారీ చేశారు. 

సింగిల్ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో లేకుండా ముద్రించారు. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ షాపు వివరాలు మాత్రమే కార్డులో ఉండేవి. ఇప్పుడు వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. దీంతో పాత కార్డుల స్థానంలో కొత్తవి అందించనున్నారు. దీనిపై కూడా త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది.