TS New Ration Cards : తెలంగాణలో కొత్త రూపంలో రేషన్ కార్డులు, త్వరలో జారీ!-hyderabad ts new form ration card replace old card after election code complete ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts New Ration Cards : తెలంగాణలో కొత్త రూపంలో రేషన్ కార్డులు, త్వరలో జారీ!

TS New Ration Cards : తెలంగాణలో కొత్త రూపంలో రేషన్ కార్డులు, త్వరలో జారీ!

Bandaru Satyaprasad HT Telugu
May 22, 2024 02:33 PM IST

TS New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పాత వాటిస్థానంలో కొత్త రూపంలో కార్డులు అందించనున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ కార్డులు జారీ కానున్నట్లు సమాచారం.

తెలంగాణలో కొత్త రూపంలో రేషన్ కార్డులు, త్వరలో జారీ!
తెలంగాణలో కొత్త రూపంలో రేషన్ కార్డులు, త్వరలో జారీ!

TS New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. ఆహార భద్రత కార్డుల రూపం త్వరలో మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమచారం. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త కార్డులు జారీ చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 89.98 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక చిన్న పుస్తకం తరహాలో రేషన్‌ కార్డులు ఉండేవి. కుటుంబ యాజమాని పేరుపై కార్డు జారీ చేశారు. కార్డులు కుటుంబ సభ్యుల ఫొటో, పూర్తి వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటిస్థానంలో రైతు బంధు పాస్‌బుక్‌ సైజ్‌లో రేషన్‌ కార్డులు అందించారు. ఈ కార్డుల్లో ముందువైపు కుటుంబ సభ్యుల ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. వెనుక భాగంలో చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. అయితే అనంతరం ఆ తర్వాత రేషన్‌ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు జారీ చేశారు. సింగిల్ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో లేకుండా ముద్రించారు. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ షాపు వివరాలు మాత్రమే కార్డులో ఉండేవి. ఇప్పుడు వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. దీంతో పాత కార్డుల స్థానంలో కొత్తవి అందించనున్నారు.

త్వరలో కొత్త రేషన్ కార్డులు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా ఏళ్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో...తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట కొత్త రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని పేద ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అర్హులందరికీ పెన్షన్లు, ఇండ్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆగష్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణలో పది ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక అర్హులను ఎంపిక చేస్తామన్నారు. కొత్త రేషన్‌ కార్డులకు ప్రజాపాలనలో లక్షలాది మంది అప్లై చేసుకున్నారన్నారు.

రేషన్ కార్డుతో సంక్షేమ పథకాలు ముడిపడి ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తేనే లబ్దిదారులు ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుంది. దీంతో కుటుంబ సభ్యుల వివరాలతో కలిపి పూర్తి సమాచారం రేషన్ కార్డులో ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 4 తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని అధికారులు చెబుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం