TG Corporation Chairpersons : కార్పొరేషన్ ఛైర్మన్ల రెండో జాబితాపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు, ఈసారి 17 మందికి ఛాన్స్!
TG Corporation Chairpersons : తెలంగాణ ప్రభుత్వం మరో 17 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి కసరత్తు చేస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రెండో జాబితాను విడుదల చేయనున్నారు.
TG Corporation Chairpersons : రాష్ట్రంలో ఇప్పటికే 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి... ఎన్నికల కోడ్ ముగియగానే మరో 17 కార్పొరేషన్ల ఛైర్మన్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదటి జాబితా, రెండు జాబితాలో కలిపి మొత్తం 54 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర కార్పొరేషన్ పదవుల్లో సీఎం రేవంత్ రెడ్డి అదృష్ట సంఖ్య 9 కలిసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఛైర్మన్లుగా నియమితులైన వారంతా ఒకేసారి బాధ్యతలు తీసుకోనున్నట్టు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో వీరందరికీ అధికారికంగా జీవోలు అందనున్నాయి. ఈ మేరకు రెండో జాబితాలో ఛైర్మన్లుగా చేర్చబోయే పేర్లపై పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తునట్టు తెలిసింది. కుల సమీకరణాలు, సీనియారిటీ, పార్టీలో కష్టపడిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మరో 17 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి కసరత్తు
ఇప్పటికే ప్రకటించిన మొదటి జాబితాలో.....గాంధీ భవన్ కేంద్రంగా పని చేసిన వివిధ పార్టీ విభాగాల ఛైర్మన్లను ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా నియమించారు. కొందరు జిల్లా స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కీలక నేతలకు కూడా మొదటి జాబితాలో అవకాశం లభించింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తూ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పరిగణనలోకి తీసుకొని అవకాశం కల్పించనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఈసారి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల నేతలకు ఎక్కువగా ప్రధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక మొదటి జాబితిలో అవకాశం దక్కని పార్టీ అనుబంధ సంఘాలకు, సెకండ్ లిస్ట్ లో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. కాగా కార్పొరేషన్లలో అత్యధికంగా యువ నాయకులకే ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి ఛాన్స్?
నామినేట్ పదవుల్లో ఈసారి పార్టీ జిల్లా అధ్యక్షులకు సైతం అవకాశం ఉంటుందనే చర్చ గత కొద్ది రోజులుగా గాంధీ భవన్ లో జోరుగా సాగుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారని, వాళ్లల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు రెండో జాబితాలో అవకాశం ఉండొచ్చు అని చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలకు కూడా కార్పొరేషన్ పదవులు కట్టబెట్టే ఆలోచనలో సీఎం ఉన్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకొని ఓడిపోయిన నేతలకు మాత్రం కార్పొరేషన్ పదవులు మాత్రం ఇవ్వలేం అని సీఎం తేల్చి చెప్పారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పలువురు నేతలు తమకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ ను కోరగా....పార్టీ విధివిధానాలను బ్రేక్ చేసే పరిస్థితి లేదని సీఎం స్పష్టం చేశారట.
రానున్న ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్...మెజారిటీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అన్ని జిల్లాలకు నామినేట్ పదవుల్లో సముచిత స్థానాలు కల్పించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది. గత రెండు రోజుల నుంచి మంత్రులు, డీసీసీలు ఆయా జిల్లాల కీలక నేతల వివరాలను గాంధీ భవన్ కు పంపిస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి శ్రమించిన నేతలకు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ను టీపీసీసీ స్టేట్ కమిటీకి పంపించారు. 17 కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల కోసం అన్ని జిల్లాల నుంచి దాదాపు వందకు పైగా పేర్లు సీఎం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఎన్నికల కోడ్ ముగియగానే ఛైర్మన్ల రెండో జాబితా ఖరారు కానుంది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా