తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Chief Ministers: కోటరీల చేతుల్లో ఏపీ ముఖ్యమంత్రులు చిక్కుతున్నారా? అందుకే ప్రజలకు దూరం అవుతున్నారా?

AP Chief Ministers: కోటరీల చేతుల్లో ఏపీ ముఖ్యమంత్రులు చిక్కుతున్నారా? అందుకే ప్రజలకు దూరం అవుతున్నారా?

Sarath chandra.B HT Telugu

18 March 2024, 7:00 IST

    • AP Chief Ministers: ఏపీలో ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నా వారి చుట్టూ దడి కట్టే కోటరీలతో నేతలు ప్రజలకు దూరం అయిపోతున్నారనే విమర్శ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బాటలోనే కోటరీల విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా నడిచారనే అపప్రద ఉంది.
ఆ విషయంలో ఇద్దరిది అదే బాట
ఆ విషయంలో ఇద్దరిది అదే బాట

ఆ విషయంలో ఇద్దరిది అదే బాట

AP Chief Ministers: ఏపీలో ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నా వారి చుట్టూ దడి కట్టే కోటరీలతో నేతలు ప్రజలకు దూరం అయిపోతున్నారనే విమర్శ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బాటలోనే కోటరీల విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా నడిచారనే అపప్రద ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

Bengalore Rave Party: బెంగుళూరులో రేవ్‌ పార్టీ భగ్నం, పోలీసుల అదుపులో ఏపీ రాజకీయ నేతలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి Chief Minister హోదాలో ఎవరు ఉన్నా వారి చుట్టూ కమ్ముకునే Coterie వ్యవస్థలతో నేతలు ప్రజలకు దూరం అవ్వడం ఏపీలో సాధారణం అయిపోయింది. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు CBN బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు రెండేళ్ల పాటు హైదరాబాద్‌-విజయవాడ మధ్య పాలన సాగింది. 2015 మే తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని తరలించాలనే నిర్ణయంతో అమరావతిలో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది.

2014-19 మధ్య కాలంలో ఓ కోటరీ గుప్పెట్లో చంద్రబాబు చిక్కుకున్నారనే అపవాదు ఉంది. ఆయన ఓ వర్గాన్ని అక్కున చేర్చుకోవడం, అధికార యంత్రాంగంలో ఓ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శ ఉంది.

2016లో ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి కొలువు దీరే ఒకటో నంబర్‌ బ్లాక్‌లో పెత్తనమంతా కొందరు అధికారుల చేతుల్లోనే ఉండేది. వీరంతా ముఖ్యమంత్రిని సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడంలో తమ వంతు పాత్ర పోషించే వారు.

2014-19 మధ్య కాలంలో పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాలనా యంత్రాంగం పనితీరును ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ప్రజలకు నేరుగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకునేది. ఆఖరికి వీధి దీపాలు ఎక్కడ వెలుగుతున్నాయో కూడా సచివాలయం నుంచి తెలుసుకోవచ్చని ఆయా విభాగాలు చెప్పుకునేవి.

ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని తరచూ నివేదికలు విడుదలయ్యేవి. ఆర్టీజిఎస్‌ సర్వేల్లో ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలులో 90శాతం సంతృప్తి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పే వారు. 2019 ఎన్నికల పోలింగ్ జరిగే రోజు వరకు ఈ ప్రచారం ఇలాగే సాగింది. ఎన్నికల ఫలితాల్లో మాత్రం అంతా తారుమారైంది.

సలహాదారులు, అధికారులదే పెత్తనం అంతా...

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే తమకు నమ్మకంగా ఉన్నవారిని సలహాదారుల పదవుల్లో నియమించుకోవడం ఏపీలో రివాజుగా మారింది. చివరకు ముఖ్యమంత్రులు వారి చెప్పు చేతల్లో నడిచే స్థాయికి చేరుతున్నారు అప్పట్లో చంద్రబాబు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇదే రివాజుగా మారింది. ముఖ్యమంత్రులు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కలవాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి వంటి అంశాల్లో మితిమీరిన ఆంక్షలు అమలు కావడానికి ఈ కోటరీలే కీలకంగా వ్యవహరిస్తుంటాయి.

చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కొలువు ఉండే సెక్రటేరియట్‌ బ్లాక్‌లో అందరిని అనుమతించే వారు. సిఎం కార్యాలయం ఉన్న ఫస్ట్‌ ఫ్లోర్‌కు మాత్రం పరిమితమైన ఎంట్రీ ఉండేది. సిఎం ప్రెస్‌ మీట్ జరిగే ప్రతి సందర్భంలో మీడియాను ఫస్ట్ బ్లాక్‌లోకి అనుమతించేవారు. జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్‌ బ్లాక్‌‌లోకి ప్రవేశాలను పూర్తిగా నిషేధించారు.

కారణం ఏమిటి..?

చంద్రబాబు హయంలో సిఎంఓలో చక్రం తిప్పిన అధికారులే ఆ తర్వాత జగన్ Jagan హయంలో కూడా అనతి కాలంలోనే సిఎం పేషీకి దగ్గరయ్యారు. ముఖ్యమంత్రి పదవికి విధేయులనే సాకుతో ఈ వర్గం అధికారులంతా కీలక పోస్టింగులు దక్కించుకున్నారు. ఒకరిద్దరు అధికారులైతే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నాలు చేసి, చివరకు ముఖ్యమంత్రికి చేరువ అయ్యారు.ఓ అధికారి ముఖ్యమంత్రికి నచ్చని పత్రికలు తన శాఖ కార్యాలయాలలో కనబడటానికి వీల్లేదని ఆదేశించి, ఆ విషయం ప్రభుత్వానికి అధికారికంగా తెలియచేసి స్వామి భక్తి ప్రదర్శించారు.

ముఖ్యమంత్రిని కలవనివ్వరు, మాట్లాడనివ్వరు…!

ఏపీ సిఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నపుడు తరచూ మీడియాతో మాట్లాడి వీలైనంత ఎక్కువ ప్రచారం పొందాలని చూసేవారు. చంద్రబాబు హయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా ముఖ్యమంత్రిని ప్రశ్నించే అవకాశం ఉండేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత మీడియాకు కూడా నేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు లేవు.

కొన్నేళ్ల క్రితం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి.. ప్రముఖ యాంకర్‌తో ముఖ్యమంత్రి ఇంటర్వ్యూకు ఒప్పించారు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ - భారతి దంపతులతో ఓ రోజంతా ఇంటర్వ్యూ షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, జగన్ రాజకీయ ప్రస్థానం, పార్టీ పెట్టినప్పటి నుంచి ఎదురైన ఇబ్బందులు వీటన్నింటిని ప్రజలకు వివరించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

చివరి నిమిషంలో ఆ కార్యక్రమంపై ప్రత్యర్థులు అభ్యంతరం చెప్పడంతో ఆ ఇంటర్వ్యూ అర్థాంతరంగా ఆగిపోయింది.సిఎంఓలో ఉన్న మరో కోటరీ తమకు తెలియకుండా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూకు ప్లాన్ చేయడం, ప్రోగ్రాం డిజైన్ చేయడం వంటివి నచ్చకపోవడంతో దానికి అడ్డుపుల్ల వేసినట్టు ప్రచారం ఉంది.

సిఎం ఇంటర్వ్యూకు ప్లాన్ చేసిన సమయంలోనే జగన్ సోదరి షర్మిల రాజకీయాల్లో ప్రవేశించాలనే నిర్ణయం వెలువడటంతో రాజకీయంగా విమర్శలు ఎదురవుతాయని, ఇంటర్వ్యూలో సున్నిత అంశాలు బయటకు వస్తే ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తుతాయని వారంతా అడ్డుపడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వెలుగు చూడని ఇంటర్వ్యూలు…

ఆ తర్వాత కాలంలో ఏపీకి చెందిన ప్రముఖ పాత్రికేయుడు ఒకరు ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని విషయాలను సిఎం ఆయనతో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ కూడా టెలికాస్ట్ కావడానికి ముందే ఆగిపోయింది.

ఆ సమయంలో ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అనవసరమని తేల్చేసి సిఎం జగన్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి.ఐదేళ్లలో జగన్ ఒక్కసారి మీడియా ముందుకు రాకపోవడానికి ఇలాంటి సలహాలే కారణమనే వాదనలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉన్నా అవసరానికి మించి సలహాదారులపై ఆధారపడటం, పర్యావసానాలు ఆలోచించకుండా విధేయత పేరుతో కోటరీలను ప్రోత్సహించడంలో ఏపీ ముఖ్యమంత్రులు పోటీ పడ్డారనే ప్రచారం ఏపీ అధికార వర్గాల్లో ఉంది.

తదుపరి వ్యాసం