తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Babu - Jagan Same To Same : ఆ విషయంలో మాత్ర ఇద్దరు ఇద్దరే…! బాబు బాటలోనే జగన్….

Babu - Jagan Same To same : ఆ విషయంలో మాత్ర ఇద్దరు ఇద్దరే…! బాబు బాటలోనే జగన్….

HT Telugu Desk HT Telugu

11 January 2023, 13:56 IST

google News
    • Babu Jagan Same To same ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఓ విషయంలో పోలికలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తలకెక్కించుకోనట్టే,   జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారట.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే సూచనలు, సలహాలను వినిపించుకోకుండా చంద్రబాబు ఆల్‌ ఈజ్ వెల్ అన్నట్లు ఎలా వ్యవహరించారో అచ్చం అలాగే జగన్మోహన్ రెడ్డి శైలి కూడా సాగుతుండటం చూసి అధికార వర్గాలు అవాక్కవుతున్నాయి. దీంతో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తప్ప  అసలు వాస్తవాలు ఆయన దృష్టికి పోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
జగన్‌, చంద్రబాబులో కామన్ పాయింట్ అదే
జగన్‌, చంద్రబాబులో కామన్ పాయింట్ అదే

జగన్‌, చంద్రబాబులో కామన్ పాయింట్ అదే

Babu Jagan Same To same ఇద్దరూ ఇద్దరే, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలను ఓ విషయంలో వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదని ఏపీ అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసిన సమయంలో ఆయన ఓ కాల్పానిక ప్రపంచంలో ఉండేవారు. వెలగపూడిలో నిర్మించిన సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌ పేరుతో వందల కోట్ల రుపాయల వ్యయంతో ఓ వ్యవస్థను రూపొందించారు.

పిడుగుల్ని కంట్రోల్ చేస్తా, వరదల్ని నియంత్రిస్తా, ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకుంటానంటూ చంద్రబాబు అప్పట్లో చేసిన ప్రకటనల వెనుక ఈ రియల్‌ టైమ్ వ్యవస్థ ఉండేది. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసి పోతుందని, అన్ని పట్టణాలు, నగరాలను సీసీటీవీలకు అనుసంధానించి వాటిని సెక్రటేరియెట్‌ నుంచి పరిశీలిస్తున్నామని చెప్పేవారు.

అప్పట్లో ఈ రియల్ టైమ్ హంగామా చంద్రబాబు కొంప ముంచుతుందని ఎవరు చెప్పినా చంద్రబాబు వినిపించుకునే వారు కాదు. ఒకరిద్దరు ఐఏఎస్‌ అధికారుల చెప్పు చేతల్లోకి చంద్రబాబు పూర్తిగా చిక్కుకుని చివరకు ఎన్నికల్లో ఓటమి పాలయ్యే వరకు కళ్లు తెరుచుకోలేక పోయారు.

ఏ పని చేసినా వంద శాతం సంతృప్తి లక్ష్యమంటూ చంద్రబాబు నోటి వెంట వినిపించేది. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు,ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్లలో సహాయక చర్యలు, పంట నష్టాలకు పరిహారం చెల్లింపులు ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా దానిని సంతృప్తకర స్థాయిలో అమలు చేయాలని చంద్రబాబు తరచూ చెప్పేవారు.

చంద్రబాబు నోటి వెంట ఆ మాటలు రావడం ఆలశ్యం మర్నాడు ఆర్టీజిఎస్‌ ప్రజాభిప్రాయ సేకరణలో 80శాతం సంతృప్తి అంటూ ఫలితాలు వచ్చేవి. ఈ పైత్యం కాస్త ఎన్నికల నాటికి 90శాతానికి చేరినా చంద్రబాబు అది నిజమే అనుకునే వారు. ఎవరైనా అలా కాదని చెప్పడానికి ప్రయత్నిస్తే వారిపై కస్సుబుస్సు లాడేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉంటూ చంద్రబాబు నాయుడిని నట్టేట ముంచిన అధికారులే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని నిలువున ముంచేలా నివేదికలు ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకు అనుగుణంగా చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు ఏపీ సిఎం నోటి వెంట సంతృప్తి సంతోషం మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 86శాతం మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తరచూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయని అధికార పార్టీ నమ్ముతోంది.

అప్పట్లో అంతే……

చంద్రబాబు హయంలో మాదిరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయంలో కూడా కొన్ని బృందాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో విజయవంతంగా తిష్టవేయగలిగాయి. అవి ఇచ్చే నివేదికలన్ని నిజమేనని ముఖ్యమంత్రి మురిసిపోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫీడ్ బ్యాక్ కన్సల్టెన్సీలతో పాటు, ఐ ప్యాక్ బృందం, రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం, సిఎం వ్యక్తిగత ఎగ్జిక్యూటివ్‌కు చెందిన సొంత బృందాలు, గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా ఉన్న కన్సల్టెన్సీలు ఇచ్చే నివేదికలన్ని ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంటున్నాయని చెబుతున్నారు.

వీటిలో క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా సంక్షేమ పథకాల ఆధారంగానే ఎన్నికల ఫలితాలను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల్లో సహజంగా రకరకాల కారణాలతో వచ్చే వ్యతిరేకత విషయంలో కూడా ముఖ్యమైన వారిని మభ్య పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

“అంతా బాగుంది, పాలన అద్భుతంగా సాగుతోంది. పత్రికల్లో మాత్రమే దుష్ప్రచారం జరుగుతోందనే సమాచారాన్ని ఇవ్వడానికే…” అన్ని ఏజెన్సీలు సిఎంఓలో కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నాయి. క్షేత్ర స్థాయి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ముఖ్యమంత్రికి వివరించే పరిస్థితులు లేకపోవడం, ముఖ్యమంత్రి అలాంటి వాటిని వినేందుకు సిద్ధంగా లేకపోవడం కూడా ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.

ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్, కేంద్ర మంత్రిత్వ శాఖలతో లైజనింగ్ కోసం ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుంటే అవి కాస్త పత్రికల్లో వచ్చే కథనాలన్నింటిని తమ ఖాతాలో వేసుకోడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని చెబుతున్నారు. తెలియక చేసే తప్పిదాలు కొన్నైతే, ముఖ్యమంత్రి ప్రాపకం కోసం కొంతమంది చెబుతున్న మాయమాటలకు పూర్తిగా పడిపోవడం చూసి Same to same అనుకుంటున్నారు. ఎదురు దెబ్బ తినే వరకు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలిసే ఛాన్స్‌ కూడా ఉండకపోవచ్చు.

తదుపరి వ్యాసం