తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Meeting : రేపే ఏపీ కేబినెట్ సమావేశం, చర్చకు రానున్న కీలక అంశాలు

AP Cabinet Meeting : రేపే ఏపీ కేబినెట్ సమావేశం, చర్చకు రానున్న కీలక అంశాలు

HT Telugu Desk HT Telugu

02 December 2024, 15:36 IST

google News
  • AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

రేపే ఏపీ కేబినెట్ సమావేశం, చర్చకు రానున్న కీలక అంశాలు
రేపే ఏపీ కేబినెట్ సమావేశం, చర్చకు రానున్న కీలక అంశాలు

రేపే ఏపీ కేబినెట్ సమావేశం, చర్చకు రానున్న కీలక అంశాలు

రాష్ట్ర మంత్రి వ‌ర్గం స‌మావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 3న కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై కీల‌క నిర్ణయాలను రాష్ట్ర మంత్రి వ‌ర్గం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడి ఆరు నెల‌లు కావ‌స్తుంది. ఆరు నెల‌ల్లో పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, ఉచిత గ్యాస్ వంటి హామీల‌ను అమ‌లు చేశారు. ఇంకా అనేక హామీలు అమ‌లుకు నోచుకోలేదు. దీంతో ప్రతిప‌క్షాల నుంచి విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో రేపు రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం కానుంది. వాస్తవానికి ఈ స‌మావేశం డిసెంబ‌ర్ 4 (బుధ‌వారం) జ‌ర‌గాల్సి ఉంది. అందుకు త‌గ్గట్టుగానే అన్ని డిపార్ట్‌మెంట్‌ల‌కు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి లేఖ‌లు రాశారు. అయితే ఈ సమావేశం డిసెంబ‌ర్ 3 (మంగ‌ళ‌వారం)న నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

రేపు (మంగ‌ళ‌వారం) అమ‌రావతి స‌చివాల‌యం ఒక‌టో బ్లాక్‌లోని కేబినేట్ హాల్‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రి వ‌ర్గం స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో కీల‌క‌మైన ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో కేబినెట్ హ్యాండ్ బుక్ ఫార్మేట్ రూపంలో ప్రతిపాద‌న‌ల‌ను త‌యారు చేసి సోమ‌వారం (డిసెంబ‌ర్‌) సాయంత్రం 4 గంట‌ల క‌ల్లా పంపాల‌ని అన్ని శాఖ‌ల ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శులు, ముఖ్య కార్యద‌ర్శులు, కార్యద‌ర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్‌లో ఇప్పటి వ‌ర‌కు ఒక్కటే అమ‌లు చేశారు. దీపావ‌ళికి సూప‌ర్ సిక్స్‌లో భాగ‌మైన మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు అమ‌లు చేశారు. మిగిలిన ఐదు హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, త‌ల్లికి వంద‌నం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, ప్రతి మ‌హిళ‌కు నెల‌కు రూ.1,500, రైతుల‌కు ఏడాది రూ.20 వేలు, నిరుద్యోగ యువ‌త‌కు నెల‌కు రూ.3,000 నిరుద్యోగ భృతి, 20 ల‌క్షల ఉద్యోగాలు వంటివి అమ‌ల‌ుకు నోచుకోలేదు. అయితే 20 ల‌క్షల ఉద్యోగాల‌కు సంబంధించి స్కిల్‌ స‌ర్వే నిర్వహించారు. మ‌రోవైపు మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే వాలంటీర్ల తొల‌గింపు, ప్రభుత్వ మ‌ద్యం షాపుల ర‌ద్దుతో అందులో ప‌ని చేసే ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు.

మ‌రోవైపు విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీట‌ర్లతో ప్రజ‌ల‌పై భారాల‌తో ప్రజ‌ల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అలాగే ప్రతిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రేపు జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గం స‌మావేశం చాలా కీల‌కం కానుంది. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చెత్తప‌న్ను వంటి నిర్ణ‌యాలు ఇప్ప‌టికే తీసుకున్నారు. అయితే రాష్ట్ర ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వంటి అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. స్వయానా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ర‌హ‌దారుల‌పై టోల్ గేట్ ఏర్పాటు గురించి మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో రేష‌న్ బియ్యం అక్రమంగా త‌ర‌లిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌నుక ఈ అంశాల‌పై కూడా కేబినెట్‌లో చ‌ర్చకు రావచ్చని తెలుస్తోంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం