తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bail For Surya Narayana: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికి సుప్రీంలో ముందస్తు బెయిల్

Bail for Surya Narayana: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికి సుప్రీంలో ముందస్తు బెయిల్

Sarath chandra.B HT Telugu

17 January 2024, 6:58 IST

google News
    • Bail for Surya Narayana: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  సూర్యనారాయణ
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

Bail for Surya Narayana: ఆంధ్రప్రదేశ్‌ ప్ఱభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే అనుమానంతో గత ఏడాది జూన్‌ నుంచి అజ్ఞాతంలో ఉంటున్న సూర్యనారాయణకు మంగళవారం జరిగిన విచారణలో సుప్రీం కోర్టు ధర్మాసనం పూర్తిస్థాయి ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీసులు 2023లో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి 5వ ముద్దాయిగా చేర్చారు.

విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ రాకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 15న ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ధర్మాసనం అదే రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

గత ఏడాది సెప్టెంబర్‌ తర్వాత ఈ కేసు రెండుసార్లు విచారణకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాయిదాలు కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం కేసు విచారణ గురించి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆరా తీసింది. సూర్యనారాయణ పలుకుబడి ఉన్న వ్యక్తి అని ముందస్తు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

ఏపీ ప్రభుత్వ వాదనలతో సూర్యనారాయణ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా విభేదించారు. ఆయన్ను ఇప్పటివరకూ ఒకసారి మాత్రమే విచారణకు పిలిచారని, ఈ నెల 14న నోటీసులు ఇచ్చి 15న విచారణకు రమ్మన్నారని తెలిపారు. దీంతో ధర్మాసనం సూర్యనారాయణకు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్‌ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏం జరిగిందంటే….

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆ తర్వాత చిక్కుల్లో ఇరుక్కున్నారు., అంతకు ముందు ఏపీజీఈఏ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేస్తామని హెచ్చరించిన ప్రభుత్వం...గత జూన్‌లో అరెస్టుకు సిద్ధమైంది.

వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. గత ఏడాది మే 30న విజయవాడ పటమట పోలీసులకు అందిన ఫిర్యాదుతో నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

ఈ కేసులోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్య నారాయణ ఏ5గా పేర్కొన్నారు. అతడిని అరెస్ట్‌ చేస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుందని ముందు ఆలోచించిన పోలీసులు జూన్‌లో అరెస్ట్ కు సిద్ధమయ్యారు. దీంతో సూర్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అజ్ఞాతంలోకి సూర్యనారాయణ

సూర్యనారాయణ అచూకీ దొరక్క పోవడంతో పరారీలో ఉన్నారని, ఆయన ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసులు ప్రకటించారు. ఈ కేసును ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కేసు నమోదు నుంచి, అరెస్ట్ వరకు ఏ దశలోనూ వివరాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారన్న సమాచారంతో సూర్యనారాయణ గత ఏడాది జూన్‌2 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సూర్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్‌ పదవిలో ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడి గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో సూర్యనారాయణ పేరు ప్రస్తావించడం సంచలనం అయింది.

సూర్యనారాయణతో పాటు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు జీఎస్టీ చట్టాలను ఉపయోగించుకుని డబ్బుల కోసం డీలర్లు, వ్యాపారులను బెదిరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో అభియోగించారు. దీంతో పాటు ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ సర్టిఫికేట్లు జారీ చేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసింది.

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ లేఖలు, ధృవపత్రాలు జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపై విచారణకు ఆదేశించామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారంపై విచారణ చేసి రిపోర్టును ప్రభుత్వానికి అందజేయాలని గతంలో ఆదేశించింది. దాదాపు ఏడు నెలల తర్వాత సుప్రీం కోర్టులో ఉద్యోగుల సంఘం నాయకుడికి ముందస్తు బెయిల్ మంజూరైంది. sa

తదుపరి వ్యాసం