KR Suryanarayana : అజ్ఞాతంలోకి ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు!
KR Suryanarayana : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. వాణిజ్య శాఖలో నిబంధనలు ఉల్లఘించారని నమోదైన కేసులో సూర్యనారాయణను ఏ5గా చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
KR Suryanarayana : ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు చిక్కులు తప్పడంలేదు. గతంలో ఈ సంఘాన్ని రద్దు చేస్తామని హెచ్చరించిన ప్రభుత్వం... తాజాగా అరెస్టుకు సిద్ధమైంది. వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారనే ఫిర్యాదుతో ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 30న విజయవాడ పటమట పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A5 ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్య నారాయణ. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుందని ముందు ఆలోచించిన పోలీసులు... తాజాగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అరెస్ట్ కు సిద్ధమయ్యారు.
అజ్ఞాతంలోకి సూర్యనారాయణ
అయితే సూర్యనారాయణ పరారీలో ఉన్నారని, ఆయన ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసులు అంటున్నారు. ఈ కేసును ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. కేసు నమోదు నుంచి, అరెస్ట్ వరకు ఏ దశలోనూ వివరాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారన్న సమాచారంతో సూర్యనారాయణ శుక్రవారం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్లు కూడా వదిలేసి గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన నలుగురు ఉద్యోగులను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ముందు హాజరుపర్చేందుకు తీసుకొచ్చినప్పుడు సూర్యనారాయణ కోర్టు వద్దకు వచ్చారు. అప్పుడే ఈ కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని, సూర్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నకిలీ సర్టిఫికెట్లు జారీ- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణ
సూర్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్ పదవిలో ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడి గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సూర్యనారాయణ పేరు ప్రస్తావించడం సంచలనం అయింది. సూర్యనారాయణతో పాటు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు జీఎస్టీ చట్టాలను ఉపయోగించుకుని డబ్బుల కోసం డీలర్లు, వ్యాపారులను బెదిరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో అభియోగించారు. దీంతో పాటు ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ సర్టిఫికేట్లు జారీ చేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ లేఖలు, ధృవపత్రాలు జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపై విచారణకు ఆదేశించామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారంపై విచారణ చేసి రిపోర్టును ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించింది.