KR Suryanarayana Suspension : కేఆర్ సూర్యనారాయణపై ఏపీ సర్కార్ వేటు, సస్పెన్షన్ ప్రొసీడింగ్స్ విడుదల
KR Suryanarayana Suspension : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకూ సస్పెండ్ ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.
KR Suryanarayana Suspension : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. సూర్యనారాయణపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలపింది. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు ఇచ్చారు. సూర్యనారాయణతో పాటు పలువురు ఉద్యోగులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టేలా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగిస్తుంది.
తనిఖీల పేరుతో డబ్బు వసూలు
మే 30న విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయిన ఓ కేసులో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఏ-5గా ఉన్నారు. 2019 నుంచి 2021 మధ్య కేఆర్ సూర్యనారాయణ, మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణలతో కలిసి వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే సూర్యనారాయణతో కలిసి వారు కుట్ర చేసినట్లు తెలిపారని ప్రభుత్వం ప్రొసీడింగ్స్‌లో తెలిపింది. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సూర్యానారాయణ, ఇతర ఉద్యోగులతో కలిసి భారీ మొత్తంలో వ్యాపారులు నుంచి తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వం అభియోగిస్తుంది. దీంతో సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన ఉద్యోగంలో ఉంటే విచారణ సజావుగా సాగదని ప్రభుత్వానికి కూడా హాని కలిగే అవకాశం ఉందని పేర్కొంది. సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకూ అనర్హత వేటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్సన్ కాలం ఆయన... అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్‌ను వదలకూడదంటూ ఉత్తర్వుల్లో తెలిపింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపిస్తూ విజయవాడ పటమట పోలీసులు సూర్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హైకోర్టు సూర్యనారాయణకు అనుమతి ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించి నిర్ణయం చెప్పాలని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు... ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పోలీసులు సూర్యనారాయణను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యనారాయణ గవర్నర్ ను కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం, సూర్యానారాయణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.