AP Aarogyasri : ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్, ప్రభుత్వానికి నెట్ ఆసుపత్రులు నోటీస్
12 March 2024, 18:24 IST
- AP Aarogyasri : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి.
ఆరోగ్య శ్రీ సేవలు
AP Aarogyasri : ఏపీలో ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు(AP Aarogyasri Services) నిలిపివేస్తామని ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు(Aarogyasri Pending bills) విడుదల చేయకపోవడంపై ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు యాజమాన్యాలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నాయి. దీంతో ఆరోగ్య శ్రీ(Aarogyasri) సేవలను నిలిపివేస్తామని నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆసుపత్రుల యాజామాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని, ఇంకా రూ.850 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీసులో పేర్కొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆసుపత్రుల ట్రస్టు యాజమాన్య కమిటీ డిమాండ్ చేసింది.
శస్త్ర చికిత్సల ఛార్జీలు పెంచాలని డిమాండ్
గత నాలుగు నెలల్లో నాలుగోసారి ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. ఆరోగ్య సేవలు (Aarogyasri services)అందిస్తు్న్న నెట్ వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ లో పెట్టింది. గత నెలలో రూ.1200 కోట్లు పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం రూ.850 కోట్ల బకాయిలు ఉన్నట్లు నెట్ వర్క్ ఆసుపత్రులు తెలిపారు. పదేళ్ల క్రితం ప్యాకేజీలతోనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని, శస్త్ర చికిత్సల ఛార్జీలు పెంచాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. గత చర్చల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీలిచ్చినా.. బిల్లులు విడుదల చేయలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. బిల్లుల విడుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత నెలలో జరిగిన చర్చల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం ఆసుపత్రులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
హామీలపై సానుకూల స్పందన రాకపోవడంతో
గత చర్చల్లో హామీలపై ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోయే సరికి ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు నోటీస్ ఇచ్చాయి. అయితే ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగుల సేవలు కొనసాగిస్తామని, కొత్త రోగులను ఈ నెల 18 నుంచి అడ్మిట్ చేసుకోకూడదని ఆసుపత్రులు నిర్ణయించాయి. గత నాలుగు నెలల్లో ఇలా నాలుగో సారి నెట్ వర్క్ యాజమాన్యాలు(Aarogyasri Network Hospitals) ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించాయి. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవడంతో ఆసుపత్రులు ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గేవి. ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించేవి. తాజా నోటీస్ పై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. గతంలో లాగా పెండింగ్ బిల్లుల్లో కొంతమేర చెల్లిస్తుందా? మరో మార్గం చూస్తుందా? వేచిచూడాలి. అయితే ఎన్నికల కోడ్ వస్తే బిల్లులు మరో రెండు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెండింగ్ బిల్లులు విడుదల కాకపోతే సమ్మె వైపు వెళ్లాలని నెట్ వర్క్ ఆసుపత్రులు భావిస్తున్నాయని తెలుస్తోంది.