Jagan Photo On E Pass Book : ఈ-పాస్ బుక్ అప్లికేషన్ పై ఇంకా జగన్ ఫొటో, అవాక్కైన రైతులు!
29 June 2024, 22:54 IST
- Jagan Photo On E Pass Book : ఏపీలో ప్రభుత్వం మారినా గత ప్రభుత్వ తాలుకా గుర్తులు మాత్రం మారడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ-పాస్ బుక్ అప్లికేషన్ పై జగన్ ఫొటో కనిపిస్తుండడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ-పాస్ బుక్ అప్లికేషన్ పై ఇంకా జగన్ ఫొటో, అవాక్కైన రైతులు!
Jagan Photo On E Pass Book : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సాధారణంగా ప్రభుత్వం మారితే పథకాల పేర్లు, ప్రభుత్వ వెబ్ సైట్లలో ఫొటోలు మారతాయి. ఇది సర్వసాధారణం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత... ప్రభుత్వ వెబ్ సైట్ లలో గత ప్రభుత్వ తాలుకా ఫొటోలు, ఓ పార్టీకి సంబంధించిన రంగులు తొలగించాలని ఆదేశించింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లను ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్ లో అందించాలని, గత ప్రభుత్వంలో నిర్దేశించినవి వినియోగించవద్దని తెలిపింది.
అయితే గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఈ-పాస్ బుక్ అప్లికేషన్ పై ఇంకా మాజీ సీఎంే జగన్ ఫొటో కనిపిస్తుంది. ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్న వారు జగన్ ఫొటో చూసి అవాక్కయ్యారు. ఈ అప్లికేషన్ లో దరఖాస్తు చేస్తే చెల్లుతుందో లేదో అన్న డైలామాలో పడ్డారు. అయితే మీ-సేవ ద్వారా అందించేం ఈ-పాస్ అప్లికేషన్ పై ఎలాంటి ఫొటోలు లేవు. గ్రామ, వార్డు సచివాలయాల లింక్ లో ఉన్న అప్లికేషన్ పై జగన్ ఫొటో వస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఆదేశాలతో గత ప్రభుత్వం చిహ్నాలు మార్చినా కొన్ని చోట్ల సంకేతిక సమస్యల కారణంగా ఇలా పాత గుర్తులు చూపిస్తున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పత్రాలపై కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్ లో ఉన్న పత్రాలనే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాలు వెనక్కి
గత వైసీపీ ప్రభుత్వంలో భూహక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు వైఎస్ జగన్ ఫొటోతో పంపిణీ చేశారు. అధికారంలోకి వస్తే వీటిని తొలగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఫొటో ఉన్న భూహక్కు పత్రాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. భూముల రీసర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూహక్కు పత్రాలను గత వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ పత్రాలను జగన్ ఫొటోను ముద్రించి భూయాజమానులకు అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు.. జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాలు, భూహక్కుపత్రాలు వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. జగన్ ఫొటోతో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలను స్వాధీనం చేసుకొని వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు జారీచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జగన్ ఫొటోతో ఉన్న భూహక్కు పత్రాల స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను హక్కుదారులకు అధికారులు త్వరలో పంపిణీ చేయనున్నారు.
జగన్ ఫొటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆస్తులపై మీ ఫొటోలేంటని ప్రశ్నించారు. ఈ వ్యతిరేకత ఎన్నికలపై ప్రభావం చూపింది. ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం పాలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకుంటున్నారు.