YS Sharmila : వైసీపీ హయాంలో గనుల దోపిడీ, వెంకట రెడ్డి తీగ అయితే పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉందో? - వైఎస్ షర్మిల
28 September 2024, 15:10 IST
- YS Sharmila : వైసీపీ ప్రభుత్వ హయాంలో గనుల దోపిడీ జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ స్కామ్ లో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు కూడా కదలాలని షర్మిల డిమాండ్ చేశారు. తెర వెనుక ఉండి, వేల కోట్లు కాజేసిన తిమింగలాన్ని పట్టుకోవాలన్నారు.
వైసీపీ హయాంలో గనుల దోపిడీ, వెంకట్ రెడ్డి తీగ అయితే పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉందో? - వైఎస్ షర్మిల
YS Sharmila : వైసీపీ ప్రభుత్వ హయాంలో గనుల దోపిడీపై గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డి లాంటి తీగలే కాదు... పెద్ద డొంకలు కూడా కదలాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట రెడ్డి అయితే...తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు.
"ఎన్జీటీ నిబంధనలు తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు..పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలి. కూటమి సర్కార్ ను డిమాండ్ చేస్తున్నాం..సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణను కోరండి" - వైఎస్ షర్మిల
వెంకటరెడ్డికి రిమాండ్
వైసీపీ ప్రభుత్వంలో గనుల, ఖనిజ, ఇసుక పాలసీల్లో కీలక పాత్ర పోషించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన... పలు రాష్ట్రాల్లో తిరుగుతూ... చివరికి దిల్లీలోని మిలటరీ కంటోన్మెంట్‌లో గత రెండున్నర నెలలు తలదాచుకున్నారని ఏసీబీకి సమాచారం అందింది. వెంకటరెడ్డి తన ఆచూకీ తెలియకుండా సిమ్ కార్డులు, ఫోన్లు స్విచాఫ్ చేసేవారని సమాచారం. ఇండియన్ కోస్ట్ గార్డు సర్వీస్ అధికారిగా పనిచేసిన ఆయన గతంలో తనకున్న పరిచయాలతో దిల్లీలోని కంటోన్మెంట్ మకాం వేశారు. వెంకటరెడ్డి, ఆయన సన్నిహితులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు, ఆయన దిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్నట్లు తెలిసింది.
ఏసీబీ అధికారులు దిల్లీ కంటోన్మెంట్ కు వెళ్లి అధికారుల అనుమతి తీసుకునే ప్రయత్నాలు చేస్తుండగా..ఈ విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి హైదరాబాద్ కు వచ్చేశారు. శంషాబాద్ సమీపంలోని సుల్తాన్‌పల్లి బ్యూటీగ్రీన్ రిసార్ట్స్‌లో ఏసీబీ బృందాలు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెంకటరెడ్డి అంటున్నారు. ఆయనను విజయవాడకు తీసుకొచ్చి శుక్రవారం వైద్యపరీక్షలు చేయించారు. ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని శుక్రవారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానం కోర్టులో హాజరుపరిచారు. గనుల శాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ ఎండీ పనిచేసిన వెంకటరెడ్డి పలు సంస్థలు, మరికొంతమంది వ్యక్తులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
వెంకటరెడ్డి కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2,566 కోట్ల మేర నష్టం ఏసీపీ వాదించింది. వాదనలు విన్న ఏసీబీ కోర్టు వెంకటరెడ్డికి అక్టోబరు 10 వరకు రిమాండ్ విధించింది. దీంతో వెంకటరెడ్డిని విజయవాడ జైలుకు తరలించారు. వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణ జరగనుంది.