AP Liquor Policy: సర్కారుకు నిల్.. ప్రైవేట్‌కు ఫుల్.. ఏపీ కొత్త లిక్కర్‌ పాలసీతో ఖజానాకు భారీగా గండి-in aps new liquor policy private shops are a huge drain on government revenue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Policy: సర్కారుకు నిల్.. ప్రైవేట్‌కు ఫుల్.. ఏపీ కొత్త లిక్కర్‌ పాలసీతో ఖజానాకు భారీగా గండి

AP Liquor Policy: సర్కారుకు నిల్.. ప్రైవేట్‌కు ఫుల్.. ఏపీ కొత్త లిక్కర్‌ పాలసీతో ఖజానాకు భారీగా గండి

Sarath chandra.B HT Telugu
Aug 12, 2024 01:33 PM IST

AP Liquor Policy: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు తలుపులు తెరవాలనే ప్రభుత్వ నిర్ణయంతో ఖజానాకు భారీగా గండిపడనుంది. గత ఐదేళ్లుగా రాష్ఠ్ర ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చిన మద్యం విక్రయాలు ప్రైవేట్ దుకాణాల రాకతో దానిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ఏపీలో కొత్త మద్యం పాలసీలో ప్రైవేట్ దుకాణాలు
ఏపీలో కొత్త మద్యం పాలసీలో ప్రైవేట్ దుకాణాలు

AP Liquor Syndicates: ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడాలనే నిర్ణయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ దుకాణాలనను అక్టోబర్‌ నుంచి వచ్చే కొత్త మద్యం పాలసీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది.

ఏపీలో గత ఐదేళ్లుగా రకరకాల బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించినా జనం మరో దారి లేక వాటినే కొనుగోలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు రెట్లు ధరలు పెంచిన ప్రభుత్వం మద్యం తయారీదారుల్ని తన దారిలోకి తెచ్చుకోడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగించింది. ఈ క్రమంలో మద్యం మీద కళ్లు చెదిరే ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చింది. మద్యం డిస్టిలరీలు, అమ్మకాలు, నగదు చెల్లింపులు మాత్రమే చేసినా ప్రభుత్వానికి ఏటా రూ.36వేల కోట్ల ఆదాయం వచ్చింది.

2018-19 నాటికి ఈ ఆదాయం రూ.18వేల కోట్లు మాత్రమే ఉండేది. కేవలం ధరల ఆధారంగానే మద్యం అమ్మకాలు జరిగినా జనం జేబులు ఖాళీ చేసుకుంటూ నాసిరకం మద్యాన్ని విధిలేని పరిస్థితుల్లో కొనుగోలు చేసేవారు. 2019 నాటికి రూ.100లోపు ధర ఉన్న ఐఎంఎఫ్‌ఎల్ మద్యం ధర దాదాపు రెట్టింపు అయ్యింది. పాపులర్ బ్రాండ్లు మొత్తం కనుమరుగై పోయాయి.

ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం మద్యం ధరల్ని గాడిన పెడుతుందని భావిస్తే మళ్లీ ప్రైవేట్ దుకాణాలను తెచ్చేందుకు ఉత్సాహం చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. మద్యం ధరల్ని గణనీయంగా తగ్గిస్తామనే ప్రకటన ప్రజలకు ఊరటనిచ్చినా ప్రైవేట్ దుకాణాలతో లాభం ఎవరికనే సందేహాలు లేకపోలేదు.

సిండికేట్లు కన్ను…

మద్యం తయారీ మొదలు విక్రయాల వరకు ప్రతి పైసాకు నాలుగైదు రెట్లు లాభాలు ఉండటాయి. దీంతో కొత్త మద్యం పాలసీపై లిక్కర్‌ సిండికేట్లు కన్నేశాయి. ఐదేళ్లుగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ప్రభుత్వం విక్రయించిన మద్యం నాణ్యత, ధరలపై ఎన్ని విమర్శలు ఉన్నా మద్యం ద్వారా లభించిన ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది.

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త లిక్కర్‌ పాలసీ ప్రవేశ పెడుతుందనే వార్తల నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లు జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇప్పటికే ప్రైవేట్‌ దుకాణాల ఏర్పాటులో అవి సక్సెస్ అయ్యాయి. వీలైనన్ని మద్యం దుకాణాలను దక్కించుకోడానికి సిండికేట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐదేళ్లుగా ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించడంతో ఆదాయాన్ని కోల్పోయిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, డిస్టిలరీలు కుమ్మక్కై కొత్త పాలసీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

కళ్లు చెదిరే ఆదాయం..

ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయ మార్గం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఏటా రూ.36వేల కోట్ల రుపాయల ఆదాయం ఖజానాకు లభిస్తోంది. ఇందులో నాలుగో వంతు ఉత్పాదక వ్యయంగా పోయినా దాదాపు రూ.27వేల కోట్ల రుపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా లభించేది. 2019కు ముందు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో మద్యం దుకాణాలు కూడా భారీగానే లాభపడ్డాయి.

ఏం జరిగిందంటే?

ఐదేళ్ల క్రితం వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసింది. 2019 ధరలకు రెండు రెట్లు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇతర మార్గాలను అన్వేషించారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం రవాణా అయ్యేది. అక్రమ రవాణా నిరోధంతో పాటు నాటుసారా తయారీని అరికట్టడానికి సెబ్ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవేమి ప్రభుత్వం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ధరల్ని కొంత తగ్గించారు. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రభుత్వ మద్యం దుకాణాలు..

2019కు ముందు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో చాలా భాగం రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేపట్టడం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగింది. గతంలో మద్యం తయారీ దారులు, విక్రయదారులు, లీజుదారులు, రాజకీయ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం దుకాణాలను తమ గుప్పెట్లో పెట్టుకునే వారు. 2019 నుంచి వీటికి అడ్డుకట్ట పడింది.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించే విధానం చాలా కాలం క్రితమే ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉంది. ఢిల్లీలో ఇటీవల లిక్కర్ పాలసీ స్కామ్‌ రాకముందు వరకు సమర్ధవంతంగా ప్రభుత్వ దుకాణాల వ్యవస్థ నడిచేది.దీని వల్ల కల్తీ మద్యం, నాసిరకం విక్రయాలకు అవకాశం ఉండేది కాదు.

ఏపీలో కూడా ఈ తరహా దుకాణాలను ప్రవేశపెట్టిన మరో పద్ధతిలో అక్రమాలు జరిగాయి. పూర్తిగా నగదుతోనే మద్యం విక్రయించడం, కొన్ని బ్రాండ్లను మాత్రమే అనుమతించడం ద్వారా కావాల్సిన వారికి మాత్రమే మద్యం అమ్ముకునే అవకాశం కల్పించారు.

ప్రభుత్వమే అమ్మాలి... అందరికి అవకాశం ఇవ్వాలి..

కొత్త మద్యం పాలసీ రూపకల్పన నేపథ్యంలో లిక్కర్ సిండికేట్ల ఒత్తిళ్లకు తలొగ్గితే చంద్రబాబు ప్రభుత్వం విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడానికి కారణమయ్యారనే నిందను మోయాల్సి రావచ్చు.

సాధారణంగా ఏ ఆహార ఉత్పత్తినైనా తయారీదారుడే స్వయంగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కేవలం మద్యం తయారీకి మాత్రమే వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. విక్రయాలను మాత్రమే ప్రభుత్వమే నిర్వహిస్తుంది. డిస్టిలరీలు తయారు చేసిన మద్యాన్ని బేవరేజీస్ కార్పొరేషన్ ద్వారా దుకాణాలకు సరఫరా చేసేవారు. ఉత్పాదక వ్యయం కంటే 100 నుంచి 200శాతం అదనంగా పన్నులు వేసి బ్రాండ్లను బట్టి నాణ్యత ఆధారంగా మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఇందులో గరిష్టంగా 8శాతం వరకు దుకాణాలకు కమిషన్‌గా వెళ్లేది. గతంలో 2019 వరకు వేలం పాట ద్వారా నిర్దిష్ట కాలపరిమితికి దుకాణాలను కేటాయించే వారు.

గత ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. 2018-19లో దాదాపు రూ.16-18వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం ఐదేళ్లలో రూ.36వేల కోట్లకు చేరింది. ఇందులో ఉత్పాదక వ్యయం, కమిషన్లు పోగా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. అయితే డిస్టిలరీను గత ప్రభుత్వంలో పెద్దలు చేజిక్కించుకుని భారీగా లాభపడ్డారనే విమర్శలు ఉన్నాయి. మద్యం వ్యాపారాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒత్తిళ్లను తట్టుకోలేక వ్యాపారాల నుంచి పక్కకు తప్పకున్నారని ప్రచారం జరిగింది.

2019 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ల స్థానంలో రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకాలకు వచ్చాయి. జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం విక్రయించిన దానిని మాత్రమే కొనే పరిస్థితి కల్పించారు. వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది. మద్యం ధరలు భారీగా పెరగడం, నాసిరకం బ్రాండ్లను విక్రయించడంతో ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది.

మద్యం ధరల నిర్ణయాధికారం ఎవరిది...

సాధారణంగా ఏ ఉత్పత్తినైనా ఎంత ధరకు విక్రయించాలనేది తయారీదారుడే నిర్ణయిస్తాడు. మద్యం మాత్రం ఏ బ్రాండ్ ఎంతకు అమ్మాలనేది ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయిస్తుంది. దీని చట్టబద్ధతపై కూడా సందేహాలున్నాయి. మద్యం నాణ్యతను, రసాయినిక ప్రమాణాలను నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వ కమిటీలకు ఉండగా ధరలను కూడా వారే నిర్ణయించే పరిస్థితి చాలా కాలంగా ఉంది. మద్యం ఆదాయం ప్రభుత్వానికి వస్తుండటంతో దీనిని ప్రశ్నించిన వారు కూడా లేరు.

దుకాణాలకు అప్పగిస్తే జరిగే దారుణాలు ఎన్నో...

మద్యం విక్రయాలను గతంలో మాదిరి దుకాణాలకు అప్పగిస్తే దాంట్లో భారీగా అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. మద్యం దుకాణాలు-రాజకీయ నాయకులు- డిస్టిలరీలు కుమ్మక్కవుతాయి. దుకాణాలకు మద్యం విక్రయాలతో వచ్చే 8శాతం కమిషన్‌లోనే షాపుల అద్దెలు, సిబ్బంది జీతాలు, ఎక్సైజ్‌ సిబ్బందికి మామూళ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏ మాత్రం లాభదాయకం కాకపోయినా మద్యం సిండికేట్లు దుకాణాలు కావాలని ఒత్తిళ్లు పెంచడం వెనుక పెద్ద దందా ఉంటుంది.

డిస్టిలరీలు బేవరేజీస్‌ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సరఫరా చేసే మద్యంతో పాటు నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తుంటాయి. మద్యాన్ని 20-30శాతం కల్తీ చేయడం ద్వారా లాభాలను పెంచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా మద్యం దుకాణాలను దక్కించుకునే వారు బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు పెంచుకుంటారు. ఇదంతా ఓ దోపిడీ ఛైన్‌‌గా మారుతుంది.

రిటైల్ వ్యాపారం ప్రభుత్వమే నిర్వహించాలి...

మద్యం రిటైల్ వ్యాపారంలో ప్రభుత్వం ఉండటం వల్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచితే ఏ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలనే విచక్షణ వినియోగదారుడికి లభిస్తుంది. ఫలితంగా నాణ్యత విషయంలో కూడా కంపెనీలు రాజీపడకుండా ఉంటాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని బ్రాండ్ల లభ్యతే అధికంగా ఉంటుంది. బ్రాండ్లను ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారుడికి ఉండదు. గతంలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలు ఎక్కువగా జరిగేవి. ప్రభుత్వ మద్యం దుకాణాలతో ఈ సమస్య పరిష్కారం కాకపోగా దుకాణాల ముందు క్యూలైన్లలో పడిగాపులు పడే పరిస్థితి కల్పించారు.

ప్రభుత్వానికి మద్యం నాణ్యతను నిర్ధారించడం, నాణ్యతా ప్రమాణాలను పాటించేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది. అయా డిస్టిలరీలు ఇచ్చే ఇథనాల్ ఫార్ములా ఆధారంగా వాటికి అనుమతులు, ధరలను నిర్ణయిస్తుంటాయి. గత కొన్నేళ్లుగా కమిటీల పేరుతో లిక్కర్ డిస్టిలరీలను లొంగదీసుకోవడంపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

మద్యం తయారీ, నాణ్యత, కొత్త బ్రాండ్లకు అనుమతించే విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. దీంతో డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలు పెట్టే కండిషన్లకు తలొగ్గుతున్నారు. అన్ని బ్రాండ్లను అనుమతించి, కోరుకున్న బ్రాండ్‌ ఎంచుకునే స్వేచ్ఛ మద్యం సేవించే వారికి ఇస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయనే వాదన ఉంది.

లిక్కర్ మార్ట్‌ల సంఖ్యను పెంచడం ద్వారా ప్రభుత్వ వ్యాపారాన్ని పెంచుకోవచ్చనే సూచనలు ఉన్నాయి.ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ విధుల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో అదనంగా ఉన్న సిబ్బందిని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది గతంలో మద్యం దుకాణాల్లో పనిచేసిన వారు కావడంతో ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.