Free Sand Policy: ఏపీలో త్వరలో ఉచిత ఇసుక పాలసీ, దళారుల దోపిడీ లేకుంటే ఖజానాకు భారీ ఆదాయ మార్గం-free sand policy in ap huge revenue for the government if there is no exploitation by brokers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Free Sand Policy: ఏపీలో త్వరలో ఉచిత ఇసుక పాలసీ, దళారుల దోపిడీ లేకుంటే ఖజానాకు భారీ ఆదాయ మార్గం

Free Sand Policy: ఏపీలో త్వరలో ఉచిత ఇసుక పాలసీ, దళారుల దోపిడీ లేకుంటే ఖజానాకు భారీ ఆదాయ మార్గం

Sarath chandra.B HT Telugu
Jul 03, 2024 10:12 AM IST

Free Sand Policy: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐదేళ్లుగా ఇసుక తవ్వకాల్లో జరిగిన దోపిడీ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది.

ఇసుక అమ్మకాలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇసుక అమ్మకాలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Free Sand Policy: ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత ఐదేళ్లుగా ఇసుక అమ్మకాల పేరుతో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పాలసీ విధివిధానాలను ఖరారు చేసే క్రమంలో పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని యోచిస్తోంది,.

2014-19 కాలంలో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక విధానం, 2019-24మధ్య అమ్మకాల లాభనష్టాలపై చర్చిస్తున్నారు. 2019-24(మే) వరకు ఇసుక అమ్మకాల విధానంలో ఎవరు లబ్ధిపొందారనే దానిపై ఆరా తీస్తున్నారు.

మంగళవారం ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జగన్‌ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహనిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డంప్‌లు వైసీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని, ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం పేర్కొన్నారు.

తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని అధికారులను సిఎం ప్రశ్నించారు. ప్రస్తుతం 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.

ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సిఎం కోరారు. ఇసుక డంప్‌లు ఎవరి అధీనంలో ఉన్నాయో సిఎం ఆరా తీశారు. ఉచిత ఇసుక విధానంతోపాటు, గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర అంశాలపై బుధవారం కూడా గనులశాఖ ఉన్నతాధికారులతో సిఎం సమీక్షిస్తారు. . ఇకపై ఆఫ్‌లైన్‌ ఇసుక అమ్మకాలు జరగడానికి వీల్లేదని సూచించారు. ఉచిత ఇసుకతోపాటు ఇతర అమ్మకాల ద్వారా సరఫరా చేసే ఇసుకను ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునే విధానం తీసుకురావాలని స్పష్టం చేశారు.

లోపాలు సరిదిద్దితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం…

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక విధానం అమలు చేశారు. అప్పట్లో ధరలు కాస్త నియంత్రణలో ఉండేవి. అయితే అక్రమ రవాణా, ఇసుక రీచ్‌లపై నాయకుల గుత్తాధిపత్యం, ఆదాయం మార్గంగా ఇసుక అమ్మకాల వంటి లోపాలు గతంలో కూడా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై 100కోట్ల జరిమానా సైతం విధించింది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలను ఆరేడు నెలల పాటు నిలిపేసింది. ప్రధానంగా బిల్డర్లు, నిర్మాణ రంగాన్ని టార్గెట్‌గా చేసుకుని ఇలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఇసుక అమ్మకాలకు తెరతీశారు. టన్ను ఇసుక ధరకు కనీస ధర నిర్ణయించి కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించారు. అయితే ఇక్కడే వైసీపీ ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శించింది. ఇసుక తవ్వకాలను మైనింగ్ శాఖతో చేయించి అమ్మకాలను జేపీ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థతో నిర్వహించారు. దీంతో అసలు ఐదేళ్లలో ఎంత ఇసుక తవ్వారు, ఎంత అమ్మారు, ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై సరైన లెక్కలు లేవు.

మార్కెట్‌లో టన్ను ధర రూ.10వేలు…

ప్రస్తుతం ఇసుక తవ్వకాలపై ఆంక్షల నేపథ్యంలో విజయవాడలో టన్ను ఇసుక ధర రూ.8 నుంచి రూ.10వేలకు చేరింది. నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఇందులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం టన్నుకు గరిష్టంగా అన్ని ఖర్చులతో కలిపి రూ.500లోపే ఉంటోంది. ప్రతి టన్ను మీద మిగిలిన రూ.9500 ఎక్కడికి పోతుందనే లెక్కలు మాత్రం లేదు.

2019 నాటికి విజయవాడ మార్కెట్‌లో 12-15టన్నుల లోడ్ ఇసుక ధర రూ.15వేల లోపు ఉండేది. ట్రాక్టర్ ఇసుక రూ.2-3వేలకు లభించేది. నగరాల్లో టిప్పర్ల రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో శివార్లలో డంప్‌ చేసి నిర్మాణ ప్రాంతాలకు తరలించుకునే క్రమంలో అదనపు భారం పడేది. ఇక సొంతింటి నిర్మాణాలు చేపట్టే వారు, ఇరుకు రోడ్లలో ఉండే నిర్మాణాలు ట్రాక్టర్లలోనే రవాణా చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇసుక ధరల వ్యత్యాసం ప్రజలపై భారంగా ఉండేది కాదు.

ఇసుక తరలింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా వాటిని ఏ ప్రభుత్వంలోను పాటించలేదు. టిప్పర్‌కు గరిష్టంగా 35-40టన్నుల లోడ్‌ చేసి తరలిస్తున్నారు. ఫలితంగా రోడ్లు కూడా ధ్వంసమైపోతున్నాయి. రీచ్‌ల నుంచి రిటైల్ మార్కెట్‌కు చేరేలోపు ధరలకు రెక్కలు వచ్చేస్తున్నాయి.

ఉచితం సముచితమేనా?

ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించినా ఆ ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందే పరిస్థితి లేదు. కారణం ఇసుకను నదులు, వాగుల నుంచి తరలించాలంటే రవాణా వాహనం కావాల్సి ఉంటుంది. దీంతో తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో గ్రామ సచివాలయాల్లో ఇసుక అమ్మకాల పేరుతో వైసీపీ హంగామా చేసినా అది ఏనాడు అమలు కాలేదు. వారం వారం ఇసుక అమ్మకాల ప్రకటనలను మాత్రం మైనింగ్ శాఖ జారీ చేసింది. ప్రతి నియోజక వర్గంలో ఇసుక ధరలు ఎంతో ఆర్భాటంగా పత్రికల్లో ప్రకటించేవారు. ఐదేళ్లలో ఒక్కరోజు కూడా ఆ ధరలకు ప్రజలు ఇసుక కొంటున్నారో లేదో తనిఖీ చేయలేదు.

ప్రస్తుతం ఐదు టన్నుల ఇసుక ధర రూ.10వేలు అనుకుంటే పది టన్నులకు 20వేల రుపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రీచ్‌ల నుంచి తరలించే ఫుల్ లోడ్‌ 35-40టన్నులకు వారికి సగటున భారీగా ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం టన్నుకు వసూలు చేసే రూ.450-475 ధరలకు మార్కెట్ విక్రయాలకు ఎక్కడ పొంతన ఉండదు. మైనింగ్‌లో కళ్లు చెదిరే డబ్బులు కనిపించడంతో అధికారులు కూడా ప్రభుత్వానికి కళ్లకు గంతలు కట్టడానికి అలవాటు పడ్డారు.

మాఫియాకు అడ్డుకట్ట పడాలి….

పంచాయితీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఇసుక మైనింగ్ మాఫియా వేళ్లూనుకుపోయింది. మద్యం తరహాలో ఇసుకను కూడా ప్రభుత్వమే నేరుగా కనీస ధరలకు విక్రయిస్తే భారీగా ఆదాయం లభిస్తుంది. అదే సమయంలో ప్రజలకు ఊరట కూడా లభిస్తుంది.

ఉచితం ప్రారంభిస్తే మళ్లీ రీచ్‌లలో దోపిడీ వ్యవస్థలకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ప్రజలు నేరుగా వెళ్లి తవ్వుకూనే సాహసం చేయరు కాబట్టి మళ్లీ దళారీ వ్యవస్థలు పుట్టుకొస్తాయి. దీనికి తోడు ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే ఎందుకు వాడుతున్నారు, అనుమతులు ఉన్నాయా అంటూ సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. నిబంధనల పేరుతో అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా మార్కెట్‌లో ఇసుక లభించే వాతావరణాన్ని ఏపీలో నిర్మాణ రంగం కోరుకుంటోంది.

నిర్ణీత సమయంలో నియంత్రిత ధరలతో ఇసుకను అందరికి అందుబాటులో ఉంచడమే మెరుగైన మార్గమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసంఘటిత రంగంలో అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి అంశం ఇసుకపైనే ఆధారపడి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం