All India Radio Jobs : ఆకాశవాణిలో పార్ట్‌టైమ్, క్యాజువల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల-అర్హులు వీరే
02 November 2024, 16:49 IST
All India Radio Jobs : ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. పార్ట్‌టైమ్, క్యాజువల్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విజయవాడ పరిధిలో ఉద్యోగాలకు నవంబర్ 8, విశాఖ పరిధిలో పోస్టులకు నవంబర్ 5 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
ఆకాశవాణిలో పార్ట్‌టైమ్, క్యాజువల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల-అర్హులు వీరే
ఆకాశవాణి విజయవాడ కేంద్రం పార్ట్‌టైమ్, క్యాజువల్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి రాజధాని ప్రాంతం, శ్రీసత్యసాయి జిల్లాలో పని చేసేందుకు పార్ట్‌టైమ్ న్యూస్ కరస్పాండెంట్ల పోస్టులు, ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ పోస్టులు, ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు దాఖలకు పార్ట్‌టైమ్ న్యూస్ కరస్పాండెంట్ల పోస్టులకు, విజయవాడలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ పోస్టులకు నవంబర్ 8, విశాఖపట్నంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు నవంబర్ 5 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
పార్ట్‌టైమ్ న్యూస్ కరస్పాండెంట్లు
ఆకాశవాణిలో అమరావతి రాజధాని ప్రాంతం, శ్రీసత్యసాయి జిల్లాలో పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైమ్ కరస్పాండెంట్ అనేది కేవలం పార్ట్ టైమ్ అసైన్మెంట్ మాత్రమే అని, శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాదని, పీఎఫ్, ఆరోగ్య పథకం, క్వార్టర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు.
అర్హతలు
జర్నలిజంలో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా కలిగి రెండు సంవత్సరాల జర్నలిజం అనుభవం ఉన్న 24 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అభ్యర్థులు జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలని, వారికి ఆకాశవాణి నిబంధనలకు అనుగుణంగా నెలవారీ జీతం చెల్లింపులు ఉంటాయని తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 8 లోగా "The Head of Office, Akashvani, Punnamathotha, M.G. Road, Vijayawada 520010" చిరునామాకు పంపాలని కోరారు. దరఖాస్తు కవరు పై భాగంలో "Application for RNU" అని తప్పనిసరిగా రాయాలని, మరిన్ని వివరాల కోసం 9440674057 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
విజయవాడలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ పోస్టులు
ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్‌గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శ్రీసాయి వెంపాటి మరో ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామకాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావని, పీఎఫ్, ఆరోగ్య పథకం, క్వార్టర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు.
అర్హతలు
క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలుగు) నియామకానికి అభ్యర్థులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత, జర్నలిజంలో డిగ్రీ/ పీజీ డిప్లొమా/పీజీ లేదా రిపోర్టింగ్ / ఎడిటింగ్ లో 5 సంవత్సవరాల అనుభవం ఉండాలి. అలాగే తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యత, కంప్యూటర్ పై అవగాహన, ఆంగ్లం నుంచి తెలుగుకి అనువాదం చేయగల నైపుణ్యం, తెలుగులో టైపింగ్ నైపుణ్యం కలిగి వుండాలని తెలిపారు.
క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ (తెలుగు) నియామకానికి అభ్యర్థులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, ఆంగ్లం నుంచి తెలుగులో తర్జుమా చేయగల నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు.
21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి, విజయవాడ ప్రాంతంలో నివసించే వారు అర్హులని అన్నారు. క్యాజువల్ విధానంలో నియమింపబడిన వారికి అసైన్ మెంట్ ప్రాతిపదికన విధుల కేటాయింపు ఉంటుందని, వారికి వార్తా విభాగం అవసరాలకు అనుగుణంగా నెలలో 1 నుంచి 6 వరకూ అసైన్మెంట్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తు రుసుము
ఆసక్తి అర్హత కలిగిన జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు రూ. 354, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగిరీ అభ్యర్థులు రూ. 266 దరఖాస్తు ఫీజును "Prasar Bharati, Akashvani, Vijayawada" పేరుతో బ్యాంక్ డ్రాఫ్ట్ ను జత చేసి నవంబర్ 8 లోగా "The Head of Office, Akashvani, Punnamathotha, M.G. Road, Vijayawada - 520010" చిరునామాకు పంపించాలని కోరారు. దరఖాస్తు కవరు పై భాగంలో "Application for RNU" అని తప్పనిసరిగా రాయాలని, వివరాల కోసం 9440674057 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.
విశాఖపట్నంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులు
ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్‌గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామకాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావని, పీఎఫ్, ఆరోగ్య పథకం, క్వార్టర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు.
అర్హతలు
క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ (తెలుగు) నియామకానికి అభ్యర్థులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, ఆంగ్లం నుంచి తెలుగులో తర్జుమా చేయగల నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు.
అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ నియామకానికి అభ్యర్థులకు రెడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. అలాగే ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు.
21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి, విశాఖపట్నం ప్రాంతంలో నివసించే వారు అర్హులని అన్నారు. క్యాజువల్ విధానంలో నియమింపబడిన వారికి అసైన్మెంట్ ప్రాతిపదికన విధుల కేటాయింపు ఉంటుందని, వారికి వార్తా విభాగం అవసరాలకు అనుగుణంగా నెలలో 1 నుంచి 6 వరకూ అసైన్మెంట్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తు ఫీజు
ఆసక్తి అర్హత కలిగిన జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు రూ. 354, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగిరీ అభ్యర్థులు రూ.266 దరఖాస్తు ఫీజు "Account Name: Prasara Bharati BCI AIR VSP; Account No: 10428603125; IFSC Code: SBIN0000772; SBI AU Campus Branch" బ్యాంకు అకౌంట్‌కు చెల్లించాలి. ఫీజు చెల్లించి రసీదును దరఖాస్తుతో జత చేసి నవంబర్ 5 లోగా "The Head of Office, Akashvani, Siripuram, Visakhapatnam - 530003" చిరునామాకు పంపించాలని కోరారు. దరఖాస్తు కవరు పై భాగంలో "Application for RNU" అని తప్పనిసరిగా రాయాలని, వివరాల కోసం 0891-2522020, 9440674057 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు