తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Student Died In Canada : కెన‌డాలో విశాఖ జిల్లా యువ‌కుడు మృతి - తీవ్ర ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు

Vizag Student Died in Canada : కెన‌డాలో విశాఖ జిల్లా యువ‌కుడు మృతి - తీవ్ర ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు

HT Telugu Desk HT Telugu

19 December 2024, 16:12 IST

google News
    • కెన‌డాలో విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన యువ‌కుడు మృతి చెందాడు. ఎమ్మెస్సీ చేసేందుకు వెళ్లిన యువ‌కుడు మృతి చెంద‌డంతో త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో ఉన్నారు. మృతి చెంది వారం రోజుల‌వుతున్నప్ప‌టికీ మృత‌దేహం స్వ‌గ్రామానికి చేరుకోలేదు. దీంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్నారు. 
పిల్లి ఫ‌ణికుమార్ (33)
పిల్లి ఫ‌ణికుమార్ (33)

పిల్లి ఫ‌ణికుమార్ (33)

 విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన యువ‌కుడు కెన‌డాలో మృతి చెందాడు.మృతి చెంది వారం రోజుల‌వుతున్నప్ప‌టికీ మృత‌దేహం స్వ‌గ్రామానికి చేరుకోలేదు. దీంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్నారు. ఈ వార్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లగా… మృతదేహాన్ని స్వ‌దేశానికి తెప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లా పెద‌గంట్యాడ మండ‌లంలోని ద‌యాల్‌న‌గ‌ర్ చెందిన పిల్లి నాగ‌ప్ర‌సాద్‌, గీతాబాయి దంప‌తుల పెద్ద కుమారుడు పిల్లి ఫ‌ణికుమార్ (33) విశాఖ‌ప‌ట్నం గీతం యూనివ‌ర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. కెన‌డాలోని కాల్‌గ‌రీలో ఉన్న స‌ద‌ర‌న్ ఆల్బెర్టా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఎమ్మెస్సీ చేసేందుకు కెన‌డా వెళ్లాడు. ఈ ఏడాది ఆగ‌స్టు 21న ఆయ‌న ఎమ్మెస్సీ చేసేందుకు కెన‌డా వెళ్లాడు. అక్క‌డ ఎమ్మెస్సీలో చేరాడు.

శ‌నివారం ఉద‌యం కెన‌డాలో ఫ‌ణికుమార్‌తో క‌లిసి ఉంటున్న స్నేహితుడు… ఫ‌ణికుమార్ సోద‌రుడు ప‌వ‌న్ కుమార్‌కు ఫోన్ చేశాడు.  రాత్రి నిద్రస్తున్న స‌మ‌యంలో ఫణికుమార్ ఎగ‌శ్వాస‌తో గుర‌క పెట్టాడ‌ని… దీంతో ఎమ‌ర్జీన్సీకి కాల్ చేయ‌గా వైద్యులు వ‌చ్చార‌ని తెలిపారు. వైద్యులు ప‌రీక్ష‌ల చేప‌ట్టి మృతి చెందిన‌ట్లు నిర్ధారించారని వివరించారు.ఈ వార్తా తెలిసిన త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు విల‌పించారు.

త‌మ బిడ్డ మ‌ర‌ణించి ఐదు రోజులు గ‌డుస్తున్నా ఇంత వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావును క‌లిసి త‌మ కుమారుడి మృత‌దేహాన్ని తెప్పించే ఏర్పాట్లు చేయాల‌ని కోరారు.

ఫణికుమార్ మృతిపై స్పందించిన ప‌ల్లా శ్రీనివాస‌రావు… ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో మాట్లాడుతాన‌ని, మృతదేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. 

స్పందించిన మంత్రి లోకేష్‌

ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విచారం వ్య‌క్తం చేశారు. ఫ‌ణికుమార్ త‌ల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. మృత‌దేహాన్ని స్వ‌దేశానికి తెప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. కుటుంబ స‌భ్యులు ధైర్యంగా ఉండాలంటూ సూచించారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు.

తదుపరి వ్యాసం