Vizag Steel Plant : ఒకేసారి 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులు తొలగింపు..!
28 September 2024, 16:09 IST
- వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఒకేసారి 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులు తొలగించారు. 30 శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల నుంచి వెనక్కి పంపాలని నిర్ణయించారు. వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కాంట్రాక్టు కార్మికులు తొలగింపు
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయమని ఒకపక్క చెబుతోన్నప్పటికీ, మరోపక్క ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్)ను సెయిల్‌లో విలీనం చేస్తారని ప్రచారం ఒకపక్క జరుగుతోంది. మరోవైపు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కసారి తొలగించింది. దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సెయిల్‌లో విలీనమనే ప్రచారాన్ని మీడియాలో పెట్టి, ప్రైవేటీకరణ దిశగా చర్యలు చేపడుతోందని స్టీల్‌ప్లాంట్ యూనియన్ నేత సీహెచ్ నర్సింగరావు విమర్శించారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులు భయపడినంత పనే యాజమాన్యం చేసింది. జనరల్ షిఫ్టుల్లో ఉండే ఇంజనీరింగ్ ఇన్‌ఛార్జులందరితోనూ యాజమాన్యం సమావేశం నిర్వహించింది. 30 శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల నుంచి వెనక్కి పంపాలని ఆదేశించింది. వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలంటూ విభాగాల అధిపతులు (హెచ్‌వోడీ)లకు యాజమాన్యం ఆదేశించింది. దీంతో ఒక్కసారి ఏళ్ల తరబడి పని చేసిన కాంట్రాక్టు కార్మికులు నిర్ఘాంతపోయారు. ఇది తొలగింపు చర్యేనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం క్రమ పద్ధతిలో కార్మికుల తగ్గింపు ప్రక్రియను స్టీల్‌ప్లాంట్ వేగవంతం చేసిందని కార్మిక సంఘం నేత, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు తెలిపారు.
ఒక పక్క టీడీపీ కూటమి నేతలు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబ నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మొదలుకొని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నప్పటికీ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉన్నాయి. అయితే ఈ చర్యలపై టీడీపీ నేతలు మౌనం దాల్చుతున్నారు.
ఆందోళన బాట పట్టిన కాంట్రాక్ట్ కార్మికులు
దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులంతా తమ గేట్‌పాస్‌లను వెనక్కి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. ఒకవైపు బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూడింటిలో రెండింటిని మూసేసి ఉత్పత్తిని రోజుకు నాలుగు వేల టన్నులకు యాజమాన్యం దిగజార్చిందని, మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్‌నార్ ప్లాంట్‌కు 500 మంది ఉద్యోగులను పంపించే ఏర్పాట్లను వేగవంతం చేసిందని, తాజాగా కాంట్రాక్టు కార్మికులపై పడిందని విమర్శించారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయంచడం దారునమని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని తక్షనమే ఉపసంహరించుకోవాలని నర్సింగరావు డిమాండ్ చేశారు. రెండు రోజుల నుంచి స్టీల్ జాయింట్ సెక్రటరీ స్వయంగా హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్లు అన్ని శాఖలను బలవంతంగా జాబితా తయారు చేయించి కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని, శనివారం ఉదయం నుంచి సెక్యూరిటీ పాసులు రద్దు చేసి లోపలికి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అయితే దీన్ని అధికారులు, కాంట్రాక్టర్లు వ్యతిరేకించారని, పనులు ఆగిపోతాయని చెప్పారని, అయినా యాజమాన్యం వినలేదని అన్నారు. పనులు ఆగిపోయినా పర్వాలేదని, నాలుగు వేల మందిని ఆపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జాయింట్ సెక్రటరీ వెల్లడించినట్లు నర్సింగరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఇటువంటి తప్పుడు పనులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
స్టీల్‌ప్లాంట్ చరిత్రలోనే ఇంతమందిని ఒకేసారి తొలగించడం ఎన్నడూ జరగలేదని, ఇది అతి దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులను తొలగింపు విషయాన్ని పక్కదారి పట్టించేందుకుకే సెయిల్‌లో ఆర్ఐఎన్ఎల్‌ను విలీనం చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. అయితే సెయిల్‌లో విలీనం చేసేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని, కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా ఆందోళన చేపడతామని పేర్కొన్నారు.
మెడికల్ చెకప్ పేరుతో తొలగింపు
అలాగే మిగిలిన కార్మికులను కూడా తొలగించే చర్యలకు యోచిస్తోంది. 50 ఏళ్ల వయస్సు దాటిన కాంట్రాక్టు కార్మికులందరికీ మెడికల్ చెకప్‌లు నిర్వహించి అన్‌ఫిటి సర్టిఫికేట్ చూపి వారిని తొగించేందుకు యాజమాన్యం ఆలోచన చేస్తోందని నర్సింగరావు అన్నారు. అందుకే తక్షణమే మెడికల్ చెకప్ చేయించాలని హెచ్‌వోడీలపై ఒత్తిడి పెంచిందని విమర్శించారు.
యాజమాన్యం ఆదేశాలపై కాంట్రాక్ట్, రెగ్యులర్ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించినా ఊరుకునేది లేదంటూ ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ఈ నెల 30న స్టీల్‌ప్లాంట్ నుంచి గాజువాక వరకూ భారీ పాదయాత్రకు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ, కార్మిక వర్గం సమాయత్తం అవుతుంది.