Cyclone Dana : దూసుకొస్తున్న 'దానా'.. తుపాను సమయంలో తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు
24 October 2024, 15:00 IST
- Cyclone Dana : వాయువ్య బంగాళాఖాతంలో 'దానా' తీవ్ర తుపానుగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున పూరీ- సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై పడే అవకాశం ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.
తుపాను సమయంలో తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు
దానా తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో.. అధికారులు అలర్ట్ అయ్యారు. దానా తీరం దాటుతున్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను సమయంలో తీసుకోవాల్సిన 10 జాగ్రత్తల గురించి వివరించారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1.పుకార్లను నమ్మవద్దు. ప్రశాంతంగా ఉండండి. భయపడవద్దు.
2.అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండండి. వాతావరణహెచ్చరికల కోసం ఎస్ఎంఎస్‌లను గమనిస్తూ ఉండండి.
3.మీ భద్రత, మనుగడ కోసం అవసరమైన వస్తువులతో.. అత్యవసర వస్తు సామాగ్రిని సిద్ధం చేసుకోండి.
4.ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి.
5.మీ విలువైన పత్రాలు, సర్టిఫికెట్లు, వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్, కవర్లలో భద్రపరుచుకోండి.
6.ఎలక్ట్రిక్ మెయిన్స్ స్విచ్ఛాఫ్ చేయండి. అన్ని విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయండి. గ్యాస్ కనెక్షన్లను తీసేయండి. తలుపులు, కిటికీలు మూసేసి ఉంచండి.
7.మీ ఇల్లు సురక్షితం కాకపోతే.. తుపాను ప్రారంభం కాకముందే.. సురక్షిత భవనాలకు వెళ్లండి.
8.పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, వైర్ల కింద అస్సలు ఉండొద్దు.
9.పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలేయండి.
10.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు.. అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
దానా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై.. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్ఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.