AP Cyclone Effect : ఏపీపై తుపాను ఎఫెక్ట్-ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు-cyclone effect on andhra pradesh weather heavy rains in coastal district on oct 24 onwards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cyclone Effect : ఏపీపై తుపాను ఎఫెక్ట్-ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

AP Cyclone Effect : ఏపీపై తుపాను ఎఫెక్ట్-ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Oct 21, 2024 06:38 PM IST

AP Cyclone Effect : ఉత్తర అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారి, ఈ నెల 23 నాటికి తుపానుగా బలపడనుందని తెలిపింది. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీపై తుపాను ఎఫెక్ట్-ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
ఏపీపై తుపాను ఎఫెక్ట్-ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రేపటికి (అక్టోబర్ 22) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారనుందని పేర్కొంది. బుధవారం (అక్టోబర్ 23) నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించనుందంది. గురువారం ఉదయానికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అల్పపీనడం గురువారం (24వ తేదీ) రాత్రి శుక్రవారం తెల్లవారుజామున (25వ తేదీ) తీవ్రతుపానుగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ప్రభావంతో గురు,శుక్రవారాల్లో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

బంగాళాఖాతంలో తుపాను నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన తుపాను సంసిద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ నుంచి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుపాను హెచ్చరిక సందర్భంగా తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు.

రేపు, ఎల్లుండి ఏపీలో వర్షాలు

ఏపీలో రానున్న రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(మంగళవారం) ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఎల్లుండి(బుధవారం) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సూర్యపేట, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం