AP SSC Exams : పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 ముఖ్యమైన అంశాలు
03 December 2024, 12:10 IST
- AP SSC Exams : ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి విడుదల చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
ఏపీ పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. దీనికి సంబంధించి 10 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి సిలబస్ అమల్లోకి వచ్చాక తొలిసారి విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
2.విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది.
3.పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, ప్రిపరేషన్, పదోతరగతి పరీక్షల బ్లూప్రింట్ ప్రకారం ప్రీఫైనల్, గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు.
4.ఈ ప్రణాళికలో సూచించినట్టు ఆదివారం కూడా నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది.
5.జనవరి 13, 14, 15 తేదీలు (సంక్రాంతి సెలవులు) మినహా అన్నిరోజులూ అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
6.సంక్రాంతి సెలవుల్లో ఇంటి దగ్గరే చదువుకునేలా మార్గదర్శకం చేయాలని ఉపాధ్యాయులకు సూచించింది.
7.పదో తరగతి సిలబస్ పూర్తి కానందున ఈ షెడ్యూల్‌ను సవరించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
8.స్కూళ్లలో పదో తరగతికి ఒకలా, మిగతా తరగతులకు మరోలా టైం టేబుల్ అమలు చేయడం వల్ల.. వేరే తరగతులకు బోధనలో ఇబ్బందులు వస్తాయని మరికొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
9.పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించనున్నారు.
10.మార్చి 10వ తేదీ వరకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విద్యాశాఖ పాఠశాలలను ఆదేశించింది.