Zaheerabad MP BB Patil : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్... బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ
Zaheerabad BRS MP BB Patil: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీజేపీ పార్టీలో చేరారు.
Zaheerabad BRS MP BB Patil : పార్లమెంట్ ఎన్నికల వేళ మరో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీని వీడారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్… శుక్రవారం ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరారు. నిన్ననే నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు కూడా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.
బీబీ పాటిల్… 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున జహీరాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ఖి సురేశ్ షెట్కర్ పై 1,44,631 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు బీబీ పాటిల్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై కేవలం 6,229 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన బీబీ పాటిల్…. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీలో చేరారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కు బీఆర్ఎస్ తరపున టికెట్ దక్కే అవకాశం లేదన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ జోరుగా నడుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో… ఆయన పార్టీనికి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అనంతరం బీజేపీ పార్టీలో చేరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బీబీ పాటిల్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను దింపాలని భావిస్తోంది. ఇప్పటికే పలు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై కూడా క్లారిటీ ఇచ్చింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ మరోసారి పోటీ చేయనుండగా,,, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉండనున్నారు. నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ అర్వింద్ కు మరోసారి అవకాశం దక్కనుంది. ఇక భువనగిరి నుంచి నర్సయ్య గౌడ్ పేరు వినిపిస్తోంది. తాజాగా పార్టీలోకి వచ్చిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కుటుంబానికి కూడా టికెట్ దక్కుతుందని సమాచారం. ఇక కీలకమైన మల్కాజ్ గిరి సీటు కోసం నేతల మధ్య గట్టి పోటీ నడుస్తోంది.
PM Modi Telangana Tour : ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 4వ తేదీన ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్‌లో జరిగి బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. ఇక 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించటంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఆ సభ తర్వాత తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఒడిశా బయలుదేరి వెళ్లనున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ మోదీ టూర్ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రంలో సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా మెజార్టీ స్థానాల్లో గెలవాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో 4 ఎంపీలను గెలుచుకొని సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ…ఈ సారి పదికిపైగా ఎంపీలను గెలవాలని గట్టిగా భావిస్తోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించింది.
మోదీ టూర్ నేపథ్యంలో…. ఏర్పాటు చేస్తున్న సభలను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆదిలాబాద్,సంగారెడ్డిలో నిర్వహించే పార్టీ సభలకు భారీగా కార్యకర్తలను తరలించాలని చూస్తున్నాయి. ప్రధాని మోదీ టూర్ ద్వారా… పార్లమెంట్ ఎన్నికల నగారా మోగించాలని భావిస్తున్నాయి.