TS Sainik School : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశాలు!
TS Sainik School : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై చర్చించారు.
TS Sainik School : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సైనిక్ స్కూల్ నెలకొల్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. సైనిక్ స్కూల్‌ను మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు పాఠశాలలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఇందుకు బదులుగా రక్షణ శాఖకు మరోచోట స్థలం కేటాయిస్తామని రక్షణ మంత్రి వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఈ విషయంపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. గురుకుల పాఠశాలల తరహాలోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్రానికి సమర్పించేందుకు సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. గతంలో వరంగల్‌కు సైనిక్ స్కూల్ మంజూరు కాగా, అప్పుడు స్థలం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేసినట్లు తెలుస్తోంది.

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు-ఈ నెల 28 ఎంట్రన్స్ పరీక్ష
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైనిక పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. 6, 9వ తరగతుల్లో అడ్మిషన్లకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష (AISSEE-2024) నిర్వహించనున్నారు. అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు కేంద్ర రక్షణశాఖ కొత్తగా ఆమోదం తెలిపిన 19 సైనిక పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పించనున్నారు.
సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఆరో తరగతికి కోసం అప్లై చేసుకునే విద్యార్థుల వయసు 2024 మార్చి 31 నాటికి 10-12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలబాలికలకు సీట్ల సంఖ్య, వయోపరిమితి ఒకే విధంగా ఉంటాయి. 6వ తరగతికి 5225 సీట్లు, 9వ తరగతికి 697 సీట్లు ఉన్నాయి. ఏపీలోని విజయనగంర జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో సైనిక స్కూల్స్ ఉన్నాయి. 9వ తరగతిలో అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థుల వయస్సు 13 -15 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపారు. దేశ వ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం జనవరి 28న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్నవారు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష కోసం నవంబర్ 7 నుంచి డిసెంబర్ 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థులు సైనిక్ స్కూల్స్ అధికారిక వెబ్‌సైట్ https://exams.nta.ac.in/AISSEE/ లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.