PM Modi Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారు - 2 జిల్లాల్లో సభలు, షెడ్యూల్ ఇదే
PM Modi Telangana Visit 2024 Updates : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారైంది. మార్చి 4,5వ తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించటంతో పాటు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 4వ తేదీన ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్‌లో జరిగి బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. ఇక 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించటంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఆ సభ తర్వాత తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఒడిశా బయలుదేరి వెళ్లనున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ మోదీ టూర్ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రంలో సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా మెజార్టీ స్థానాల్లో గెలవాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో 4 ఎంపీలను గెలుచుకొని సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ…ఈ సారి పదికిపైగా ఎంపీలను గెలవాలని గట్టిగా భావిస్తోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించింది.
మోదీ టూర్ నేపథ్యంలో…. ఏర్పాటు చేస్తున్న సభలను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆదిలాబాద్,సంగారెడ్డిలో నిర్వహించే పార్టీ సభలకు భారీగా కార్యకర్తలను తరలించాలని చూస్తున్నాయి. ప్రధాని మోదీ టూర్ ద్వారా… పార్లమెంట్ ఎన్నికల నగారా మోగించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం… త్వరలోనే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ప్రధాని టూర్ పై సీఎస్ సమీక్ష….
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.
ప్రధానమంత్రి 4వ తేదీన ఆదిలాబాద్, మార్చి 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రెండు చోట్ల బహిరంగ సభల్లో కూడా ప్రసంగిస్తారని ఆమె తెలిపారు. అందుకు అనుగుణంగా బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ప్రధాన కార్యదర్శి సూచించారు. విమానాశ్రయం, హెలిప్యాడ్‌లతో పాటు అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులకు ఆదేశించారు. అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని, ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. ప్రధానమంత్రి కాన్వాయ్ పర్యటించే మార్గాలలో రోడ్లు పరిశీలించాలని ఏ వైన మరమ్మత్తులు ఉంటే యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని పోలీసు, GHMC, రోడ్లూ భవణాల శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా చూడాలని సూచించారు.
సంబంధిత కథనం