TS Assembly Elections 2023 : ఆయన పోటీపైనే అందరి చూపు..! సరికొత్తగా 'సంగారెడ్డి' పాలిటిక్స్-which party will win in sangareddy in upcoming assembly elections in telangana 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : ఆయన పోటీపైనే అందరి చూపు..! సరికొత్తగా 'సంగారెడ్డి' పాలిటిక్స్

TS Assembly Elections 2023 : ఆయన పోటీపైనే అందరి చూపు..! సరికొత్తగా 'సంగారెడ్డి' పాలిటిక్స్

Mahendra Maheshwaram HT Telugu
Aug 13, 2023 05:40 AM IST

Sangareddy Assembly Constituency : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తినిరేపే నియోజకవర్గం సంగారెడ్డి. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ...సంగారెడ్డిలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు.

సంగారెడ్డి రాజకీయం
సంగారెడ్డి రాజకీయం

Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రతి నియోజకవర్గం సెంటర్ లోనూ ఎన్నికల ముచ్చటే నడుస్తోంది. ప్రధాన పార్టీలు... కార్యాచరణను సిద్ధం చేయటమే కాదు జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలు నియోజకవర్గాన్ని చుట్టుముట్టేస్తున్నారు. ఎన్నికలు సమీపించిన వేళ... పార్టీ అధినాయకత్వం సూచనలతో పాటు ఎవరికి వారీగా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మాటల యుద్ధం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గంలోని పాలిటిక్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఇక్కడ సీన్ ఉండగా... సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడుగులు ఎటువైపు అన్న చర్చ కూడా ఉంది. ఈసారి తమ పార్టీ జెండా ఎగరటం ఖాయమని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫలితంగా సంగారెడ్డి పాలిటిక్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.

సంగారెడ్డి... ఉమ్మడి మెదక్ జిల్లాలోని అత్యంత హాట్ అసెంబ్లీ సీట్. మిగతా నియోజకవర్గాల్లో తీర్పు ఒకలా ఉంటే... ఇక్కడ మాత్రం భిన్నంగా ఉంటుంది. నియోజకవర్గ చరిత్ర చూస్తే అత్యధికంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా... నాలుగు సార్లు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచారు. ఇక బీఆర్ఎస్ రెండుసార్లు విక్టరీ కొట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చూస్తే... ఇక్కడ సీన్ మారిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా - నేనా అన్నట్లు ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ విజయం సాధించారు. అప్పటి వరకు సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అడ్డా అన్నట్లు ఉన్న పరిస్థితి కాస్త తారుమారు అయిపోయింది. చింతా ప్రభాకర్ కు 82,860 ఓట్లు పోలు కాగా... కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న జగ్గారెడ్డికి 53,338 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 29,522 ఓట్ల తేడాతో కారు దూసుకెళ్లింది. ఆ తర్వాత సంగారెడ్డి అడ్డాలో.... బీఆర్ఎస్ దూకుడు పెరిగింది. బీఆర్ఎస్ హైకమాండ్ కూడా సంగారెడ్డిపై ప్రత్యేకమైన కార్యాచరణతోనే ముందుకెళ్లింది.

సీన్ రివర్స్.. మళ్లీ ఎగిరిన హస్తం జెండా…

2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కారు దూసుకెళ్లినప్పటికీ... సంగారెడ్డిలో సీన్ మారిపోయింది. ఇక్కడ మళ్లీ హస్తం జెండా ఎగిరింది. జగ్గారెడ్డికి 76,572 ఓట్లు రాగా... బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న చింతా ప్రభాకర్ కు 73,983 ఓట్లు వచ్చాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో... కేవలం 2,589 ఓట్ల తేడాతో జగ్గారెడ్డి విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ గెలిచినప్పటికీ... నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు తగ్గలేదు. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విక్టరీ కొట్టింది. కేవలం సంగారెడ్డి ఎంపీపీ తప్ప... మిగతా అన్నిచోట్ల పాగా వేసింది. నియోజకవర్గ పరిధిలో ఉన్న రెండు మున్సిపాలిటిల్లో కూడా బీఆర్ఎస్ విక్టరీ కొట్టింది. ఇక చింతా ప్రభాకర్ కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయనకు చేనేత కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా వచ్చింది. ప్రొటోకాల్ ఉండటంతో.... ప్రభుత్వపరంగా చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జగ్గారెడ్డికి ధీటుగా ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే మరోసారి అవకాశం వస్తుందని భావిస్తున్న ఆయన...మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తామని చెబుతున్నారు.

ఆసక్తికరంగా జగ్గారెడ్డి అడుగులు…!

సంగారెడ్డి కాంగ్రెస్ లో జగ్గారెడ్డిది వన్ మేన్ షో అని చెప్పొచ్చు. ఆయన్ను ధీటుగా ఎదుర్కొనే నేతలు లేరు. పైగా ఆయన చెప్పిందే ఫైనల్ అన్నట్లు పార్టీ వ్యవహారాలను నడిపిస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా కొంతకాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. రేవంత్ నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన వారిలో ఒకరిగా ఉన్నారు జగ్గారెడ్డి. ఆ తర్వాత హైకమాండ్ సూచనలో సైలెన్స్ అయ్యారు. కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారనే చర్చ నడుస్తోంది. గులాబీ జెండా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతేడాది జగ్గారెడ్డి, కేటీఆర్ కలిసిన సమయంలోనే ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటిని ఖండిస్తూ వచ్చారు జగ్గారెడ్డి. మళ్లీ కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అందుకు తగ్గటే కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. జగ్గారెడ్డి పార్టీలోకి వచ్చినా...చింతాకే టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గానికి చాలా మంది నేతలు ఈ మధ్యనే భేటీ అయ్యారు. ఇందుకోసం భారీ సమావేశాన్నే నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో... జగ్గారెడ్డి నిజంగానే కారెక్కుతారా అన్న చర్చ సర్వత్రా వినిపించింది. వీటిపై జగ్గారెడ్డి నుంచి రియాక్షన్ లేకపోవటంతో... కాంగ్రెస్ కేడర్ లో కూడా కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్నట్లు అయింది. నిజానికి 2004లో టీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు జగ్గారెడ్డి. ఆ తర్వాత కేసీఆర్ ను విభేదిస్తూ... వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2009, 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున గెలిచారు. జగ్గారెడ్డి పార్టీ మార్పు ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరోసారి కూడా ఆయనే బరిలో ఉంటే.... ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఉంటుంది. అలాకాకుండా కారెక్కితే సీన్ కంప్లీట్ గా మారిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే జగ్గారెడ్డి పోటీ ఏ పార్టీ నుంచి అనేదే ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక బీఆర్ఎస్ నుంచి పట్నం మాణిక్యం, పులిమామిడి రాజ్ తో పాటు డాక్టర్ శ్రీహరి కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరే కాకుండా ఉద్యోగ సంఘాల నేతగా పేరున్న మామిళ్ల రాజేందర్ కూడా తన వంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మరోసారి దేశ్ పాండే టికెట్ ఆశిస్తుండగా... టీఎస్పీఎస్పీ మాజీ సభ్యుడు విఠల్ కూడా రేసులో ఉన్నారు. మొత్తంగా 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీలు, దళితులతో పాటు మైనార్టీల ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది బీసీ కోటాలో తమకు టికెట్ ఇవ్వాలని ఆయా పార్టీల అధినాయకత్వాలను కోరుతున్నారు. మొత్తంగా సిటీ శివారుగా ప్రాంతంగా ఉన్న సంగారెడ్డిలో ఈ సరికొత్త రాజకీయాలు… అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం