Jagga Reddy | జగ్గారెడ్డికి కాంగ్రెస్ ఊహించని షాక్.. ఆ బాధ్యతలు తొలగింపు
కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.. వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాక్ ఇచ్చింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి తొలగించింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి అన్నట్టుగా అంతర్గత పోరు నడుస్తుంది. అయితే తాజాగా.. అధిష్టానం జగ్గారెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీకి చెందిన అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తప్పిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డి బాధ్యతలను మిగతా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించింది.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. జగ్గారెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అయితే గతంలో తాను స్వతంత్రంగా ఉంటానని.. అధిష్ఠానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మధ్య రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, సీనియర్లతో భేటీ కూడా బాధ్యతల నుంచి తప్పించడానికి కారణంగా తెలుస్తోంది. జగ్గారెడ్డి నుంచి తొలగించిన బాధ్యతల్ని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, మహేష్‌గౌడ్‌కు అప్పగించారు.
పార్టీలో సీనియర్లు ఉండగా.. రేవంత్ కు టీపీసీసీ ఇవ్వడంపై.. మెుదటి నుంచి.. జగ్గారెడ్డి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాలపైనా.. మండిపడుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు రేవంత్ రెడ్డికి సవాళ్లు కూడా విసిరారు.
ఇటీవలే హైదరాబాద్ లో పార్టీ సీనియర్ నేతలతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నేతలకు చెప్పారు. తన వద్ద అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే... రేవంత్ హీరో అని.. ఒప్పుకుంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సవాల్ ను.. రేవంత్ రెడ్డి స్వీకరిస్తే.. తాను రాజీనామా చేస్తానని అన్నారు. 'గెలిస్తే నేను హీరో, ఇద్దరం ఓడితే ఇద్దరం జీరోల. పార్టీ సిద్ధాంతంలో రేవంత్‌రెడ్డి పని చేయడం లేదు. తన కూతురు సమస్యపై హరీశ్‌రావును వీహెచ్ కలిస్తే తప్పేంటి.' అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
సీనియర్ల సమావేశాన్ని సీరియస్ గా తీసుకుంది పార్టీ హైకమాండ్. రంగంలోకి దిగిన ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సమావేశానికి ముందే పలువురికి ఫోన్లు చేశారు. ఇందులో భాగంగా వీహెచ్ తో మాట్లాడిన ఆయన.. పార్టీలో సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇలాంటి భేటీలతో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పారు.
అయితే అదే సమయంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి.. సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతానని హెచ్చరించారు. తనను సస్పెండ్ చేసిన కూడా పార్టీకి విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. తనకు పార్టీ నుంచి షోకాజ్ నోటీసు వస్తే.. సమాధానం చెబుతానని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి వివాదం నడుస్తుందో చూడాలి.
సంబంధిత కథనం