Jaggareddy Comments: ఇదేమైనా ఐటీ కంపెనీనా..? పీసీసీ తీరుపై జగ్గారెడ్డి సీరియస్
mla jaggareddy sensational comments: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పది మంది కూడా కూర్చొలేని పరిస్థితి ఉందన్నారు. పీపీసీ ప్రెసిడెంట్ చేస్తున్నది వంద శాతం తప్పు అన్నారు.
jaggareddy sensational comments on pcc leaders: జగ్గారెడ్డి... తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన రూటే సెపరేట్ అన్నట్లు ఉంటుంది. చాలా రోజులుగా తన కామెంట్స్ తో సొంత పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆయన... కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఈ మధ్య సంగారెడ్డి మీదుగా సాగిన రాహుల్ పాదయాత్రలోనూ యాక్టివ్ గా ఉన్నారు. అన్నీ తానై చూశారు. అయితే తాజాగా మరోసారి పీసీసీ నేతలను టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మహేశ్ గౌడ్ పై విమర్శలు గుప్పించారు.
శనివారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి... ఇవాళ మహేష్ గౌడ్ తనకు ఫోన్ చేసి.. జూమ్ మీటింగ్ ఉందని చెప్పారని.. అయితే అలా చెప్పగానే తనకు కోపం వచ్చిందని అన్నారు. ఇదేమైనా ఐటీ కంపెనీనా.. ఇళ్లలో కూర్చొని మాట్లాడుకోవడానికి అని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ పద్దతి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇలా అయితే కష్టమని చెప్పారు. పీసీపీ అధ్యక్షుడిది కూడా తప్పేనని విమర్శించారు. వారం, పది రోజులకోకసారి మీటింగ్ అని చెప్పారని.. అసలు మీటింగులే పెట్టడం లేదన్నారు. అందరూ గాంధీ భవన్‌లో కూర్చొని చర్చించాలని అన్నారు. రాష్ట్రంలో ఓవైపు అధికార టీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా వ్యవహరిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలేమో జూమ్ మీటింగ్ లతో ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న పది మంది కూడా కూర్చొలేని పరిస్థితి ఉందన్నారు జగ్గారెడ్డి. దీనికి తాను కూడా బాధ్యుడినేనని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పీసీసీ అవకాశం ఇస్తే.. అన్ని చేస్తానని తెలిపారు. తనకు పీసీసీ అవకాశం ఇస్తే తన దగ్గర మెడిసిన్ ఉందన్నారు. ఎన్నికల ముందు పీసీసీని మార్చమని తాను చెప్పడం లేదన్నారు. మీడియాలో వచ్చినట్టుగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్‌కు నష్టమేనని స్పష్టం చేశారు. అందుకు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కదేనని తెలిపారు.
పాదయాత్రలో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆయన ఒక్కడే పనిచేస్తున్నానని బిల్డప్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ హోదా మరిచిపోయి టీవీల్లో మాట్లాడుతున్నారని విమర్శించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పేనని వ్యాఖ్యానించారు.