Marri Shasidhar: బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి…-ndma founder vice president marri shasidhar reddy may join in bjp soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ndma Founder Vice President Marri Shasidhar Reddy May Join In Bjp Soon

Marri Shasidhar: బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి…

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 08:56 AM IST

Marri Shasidhar కాంగ్రెస్‌ పార్టీలో మరో వికెట్ పడబోతోంది. సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గత వారం రోజులుగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్నా ఆయన వాటిని ఖండిస్తూ వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో కలిసి కేంద్ర హోం మంత్రితో భేటీ కావడంతో మర్రి శశిధర్‌ చేరిక లాంఛనం కానుంది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో బీజేపీలో చేరుతారని చెబుతున్నారు.

బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి (ఫైల్)
బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి (ఫైల్) (facebook)

Marri Shasidhar Reddy కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీని వీడనున్నారు.గత వారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీ చేరినపుడే పార్టీ మారుతారనే వార్తలు వచ్చాయి. అయితే మనుమడి స్కూల్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మాత్రమే ఢిల్లీ వచ్చానని మర్రి శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని మీడియాపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

పార్టీ మార్పుపై పుకార్లను నిజం చేస్తూ మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకో నున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో ఉన్న సుదీర్ఘ బంధానికి మర్రి శశిధర్ రెడ్డి చెల్లు చెబుతున్నారు. బీజేపీలో చేరేందుకు శశిధర్‌ రెడ్డి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌తో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. దాదాపు 35 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. మర్రి శశిధర్‌ రెడ్డి కుటుంబ నేపథ్యాన్ని బండి సంజయ్ అమిత్‌షాకు వివరించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి పనిచేసిన విషయాన్ని అమిత్‌షాకు బండి వివరించారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై అమిత్‌షా, మర్రి శశిధర్‌ రెడ్డిల మధ్య చర్చజరిగింది. మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపడాన్ని అమిత్ షా స్వాగతించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు ముందున్నాయని, శశిధర్‌ రెడ్డి వంటి నాయకులు బీజేపీలో చేరడం శుభ పరిణామంగా అమిత్ షా అభిప్రాయపడ్డారని పార్టీ నేతలు తెలిపారు.

హైదరాబాద్‌ వెళ్లి కార్యకర్తలు, అనుచరులతో చర్చించి త్వరలోనే పార్టీలో చేరుతానని అమిత్‌షాకు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. అమిత్‌షాతో జరిగిన భేటీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భేటీలో పాల్గొనాల్సి ఉన్నా ఐజ్వాల్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోవడంతో అమిత్‌షాతో జరిగిన భేటీకి దూరంగా ఉండాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్ అమిత్‌షా కు వివరించారు.

కాంగ్రెస్‌ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకునేందుకు మర్రి శశిధర్ రెడ్డి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హోదాలో మర్రిశశిధర్‌ రెడ్డి పనిచేశారు. యూపీఏ హయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించిన ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉంటూ వచ్చారు.

రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆయనతో సన్నిహితంగా ఉండే నాయకుల్లో చాలామంది కాంగ్రెస్‌ పార్టీని వీడటం, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు లేవనే అంచనాతోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో కూడా మర్రి శశిధర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు.

IPL_Entry_Point