Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి..? ఎప్పుడు చేస్తారు..? అనుమతి ఉంటుందా…-what is the phone tapping and what rules says by govt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి..? ఎప్పుడు చేస్తారు..? అనుమతి ఉంటుందా…

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి..? ఎప్పుడు చేస్తారు..? అనుమతి ఉంటుందా…

Mahendra Maheshwaram HT Telugu
Nov 10, 2022 06:05 AM IST

ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా..? ఎవరివి చేస్తారు..? ఎప్పుడు చేస్తారు..? ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? అసలు ఫోన్ ట్యాపింగ్ ఏంటో చూద్దాం...

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి..? ఎప్పుడు చేస్తారు..?
ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి..? ఎప్పుడు చేస్తారు..?

Phone Tapping Contraversory: ఫోన్ ట్యాపింగ్... కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మోదీ సర్కార్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే... టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలోనూ ట్యాపింగ్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం...

yearly horoscope entry point

ఫోన్ ట్యాపింగ్ అంటే..?

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అంటే... అనుమతి లేకుండా మరొకరి సంభాషణ వినడం లేదా చదివటం వంటివి చేస్తే దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. దీన్నే వైర్ ట్యాపింగ్ అని కూడా అంటారు. ఉదాహరణకు.. మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటే మూడో వ్యక్తి మీ ఇద్దరి సంభాషణను రికార్డ్ చేస్తే లేదా చదివినట్లయితే ట్యాపింగ్ చేయటం అని అంటారు.

ట్యాపింగ్ చట్ట విరుద్ధమా..? కాదా..?

ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం. ఇది అన్ని సందర్భాల్లో కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీన్ని చేసేందుకు వీలు ఉంటుంది. ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు.. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్... ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, విదేశాల‌తో స‌త్సంబంధాల నిర్వ‌హ‌ణ‌తోపాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, లేదా కేంద్ర ప్ర‌భుత్వం కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేయవచ్చు. ఈ స‌మాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూట‌ర్‌లో కూడా స్టోర్ చేస్తారు.

ఎవరు చేస్తారు..?

రాష్ట్రాల పరిధిలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇక కేంద్రం పరిధిలో చూస్తే... ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ (ఆర్ఏడ‌బ్ల్యూ), డైరెక్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ ఉన్నాయి.

చట్టాలు ఉన్నాయా..?

indian telegraph act: మన దేశంలో చూస్తే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ - 1885 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ గురించి చెబుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ - 5(2) ప్రకారం... దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, ప్రజాశ్రేయస్సు వంటి అంశాల్లో రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి పెద్ద ప్రక్రియే ఉంటుంది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం-2000లోని సెక్ష‌న్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చెబుతోంది. ఇక కాల్స్‌ను రికార్డు చేయ‌డానికి లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ విష‌యంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యంలో రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఇండియ‌న్ టెలిగ్రాఫ్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 26 (బి) ప్ర‌కారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తారు. ఇలా చేస్తే పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించటం కిందకు వస్తుంది. పెగాసెస్ అనే ఇజ్రాయేల్ స్పైవేర్‌తో భార‌త్‌లోని మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై నిఘా పెట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదే విషయంలో ప్రస్తుతం ఉన్న ఏపీ సర్కార్... విచారణ కూడా జరుపుతోంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ పెగాసెస్ ను ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సాఫ్ట్ వేర్ పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పలు ఆరోపణలు చేశారు.

Whats_app_banner