Warangal BRS : బాబాయ్ వర్సెస్ అబ్బాయ్..! 'దాస్యం' ఫ్యామిలీలో చిచ్చు రేపిన రాజీనామా
Dasyam Abhinav Bhaskar Resign: వరంగల్ నగర బీఆర్ఎస్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం బీజేపీలో చేరారు.
Dasyam Abhinav Bhaskar Resign: ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా చెప్పుకొనే దాస్యం ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అంతా బాగానే ఉండగా దాస్యం వినయ్ భాస్కర్ ఓటమి తరువాత ఆ ఫ్యామిలీలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ కొడుకు, గ్రేటర్ వరంగల్ 60వ డివిజన్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ కు, తన బాబాయ్ వినయ్ భాస్కర్ కు మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తుండగా.. బాబాయ్ తనపై విష ప్రచారం చేస్తున్నాడంటూ అభినవ్ భాస్కర్ పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేశాడు. ఈ మేరకు బుధవారం రాత్రే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్కు పంపించారు. దీంతో నియోజకవర్గంలో బాబాయ్, అబ్బాయ్ తీరుపై జోరుగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో బీజేపీ లో చేరబోతున్నాడనే ప్రచారం కూడా జోరందుకుంది.
ప్రణయ్ భాస్కర్ కొడుకుగా యూత్ లో స్టాంప్
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో దాస్యం కుటుంబానికి ప్రత్యేకమైన పేరుంది. దాస్యం ఫ్యామిలీలో ఉదయ్ భాస్కర్, ప్రణయ్ భాస్కర్, వినయ్ భాస్కర్, విజయ్ భాస్కర్ నలుగురు బ్రదర్స్ కాగా.. ఆ కుటుంబం నుంచి ప్రణయ్ భాస్కర్ మొదట రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో టీడీపీ నుంచి హనుమకొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత 1994లో మళ్లీ అక్కడే పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ మంత్రివర్గంలో క్రీడలు, , యువజన సంక్షేమశాఖ మంత్రి సేవలందించారు. కాగా 1997లో ప్రణయ్ భాస్కర్ మరణించాక.. ఆయన భార్య టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వినయ్ భాస్కర్ తెరమీదకు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పాల్గొని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు విజయం సాధించారు. కాగా మొన్నటివరకు విదేశాల్లో చదువుకుని వచ్చిన దివంగత ప్రణయ్ భాస్కర్ కొడుకు అభినవ్ భాస్కర్ 2021లో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60వ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించాడు. ఇందుకు వినయ్ భాస్కర్, విజయ్ భాస్కర్ కూడా సహకారం అందించారు. ఇంతవరకు బాగానే ఉండగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రణయ్ భాస్కర్, వినయ్ భాస్కర్ కుటుంబాల మధ్య చిచ్చు మొదలైనట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ గా ఉన్న అభినవ్ భాస్కర్ తన తండ్రికి ఉన్న మాస్ ఫాలోయింగ్ తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. పలుమార్లు ఆయన యూత్ ను గ్యాదర్ చేయడం కూడా చర్చకు తావిచ్చింది. కానీ ఆ తరువాత అభినవ్ భాస్కర్ సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ వినయ్ భాస్కర్ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. కానీ అనూహ్యంగా వినయ్ భాస్కర్ ఓటమి పాలయ్యారు.
ఎన్నికల నుంచే మొదలైన కయ్యం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar) ఓడిపోగా.. అప్పటి నుంచి వినయ్ భాస్కర్, అభినవ్ భాస్కర్ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలిసింది. ఎన్నికల్లో తన ఓటమికి అభినవ్ భాస్కర్ సహకరించకపోవడమేనని వినయ్ భాస్కర్ తన అనుచరులతో చర్చించినట్లు తెలిసింది. ఈ విషయం కాస్త అభినవ్ చెవిలో పడగా.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. దీంతోనే కొద్దిరోజులుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కాగా కొంతమంది చెప్పుడు మాటలు పట్టుకుని వినయ్ భాస్కర్ తన అన్న కొడుకైన అభినవ్ భాస్కర్ ను దూరం కొట్టాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
విష ప్రచారం చేస్తున్నాడంటూ ఆవేదన
బాబాయ్ వినయ్ భాస్కర్ తో విభేదాలు తలెత్తడం, నానారకాల మాటలు చెవిలో పడటంతో అభినవ్ భాస్కర్(Dasyam Abhinav Bhaskar) కూడా వేదనకు గురయ్యారు. ఈ మేరకు నాలుగు రోజులు కిందట అభినవ్ భాస్కర్ తన తండ్రి ప్రణయ్ భాస్కర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తన తండ్రితో పని చేసిన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆయన అభిమానులను ఆహ్వానించాడు. అందరి మధ్య బాహటంగానే తన మనసులో ఉన్న ఆవేదనను వెళ్ల గక్కారు. తన తండ్రి మరణం తరువాత తన తల్లికి బదులు బదులు బాబాయ్ కి అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చాడు అభినవ్ భాస్కర్. 2023 సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని, ఆ పార్టీ పెద్దలు చెప్పినా వినలేదని, తమ కుటుంబంలో కలహాలు వస్తాయన్న ఉద్దేశంతో తన బాబాయ్ కోసం పూర్తిస్థాయిలో పని చేశానన్నారు. తన చుట్టూ ఉండే నలుగురైదుగురి మాటలు నమ్మి, తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పుకుంటుండటం తనను కలచివేసిందన్నారు. ఆత్మగౌరవం లేని చోట ఉండలేనని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని అభినవ్ భాస్కర్ ఆ సమావేశంలో ఆవేదనను వెలిబుచ్చారు.
బీఆర్ఎస్కు రాజీనామా.. బీజేపీలోకి ఎంట్రీ..
బుధవారం రాత్రి అభినవ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అభినవ్ భాస్కర్ విదేశాల్లో చదువుకున్నప్పుడు బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు, అభినవ్ స్నేహితులని తెలిసింది. తన స్నేహితుడితో మంతనాలు జరిపి బీజేపీలో చేరారని టాక్ వినిపిస్తోంది. బాబాయ్ తో ఏర్పడిన కయ్యంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన అభినవ్.. తొందర్లోనే వినయ్ భాస్కర్ కు చెక్ పెడతారంటూ స్థానికంగా చర్చ మొదలైంది.