Dasyam Vinay Bhaskar : దాస్యం వినయ్ భాస్కర్ నామినేషన్ రిజెక్ట్ చేయండి, ఆర్వోకు బీజేపీ అభ్యర్థి భర్త ఫిర్యాదు
Dasyam Vinay Bhaskar : వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ నామినేషన్ రిజెక్టు చేయాలని ఫిర్యాదు అందింది. వినయ్ భాస్కర్ అఫిడవిట్ తప్పుడు సమాచారం ఇచ్చారని బీజేపీ అభ్యర్థి భర్త ఆర్వోకు ఫిర్యాదు చేశారు.
Dasyam Vinay Bhaskar : నామినేషన్ స్క్రూటినీ వేళ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు షాక్ తగిలింది. ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిందిగా రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు అందింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నామినేషన్లు దాఖలు చేసిన అనుభవం ఆయనకు ఉండగా.. స్క్రూటినీ రోజే ఫిర్యాదు అందడంతో ఒక్కసారిగా ఆయన కంగుతిన్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో సోమవారం ఆఫీసర్లు స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభించారు. ఇందుకు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఎలక్షన్ ఏజెంట్లు కూడా పాల్గొన్నారు. కాగా బీజేపీ అభ్యర్థి రావు పద్మరెడ్డి తరఫున ఆమె భర్త, న్యాయవాది రావు అమరేందర్‌రెడ్డి హాజరయ్యారు. కాగా స్క్రూటినీ అనంతరం అమరేందర్‌రెడ్డి సిట్టింగ్ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు అందించారని హనుమకొండ ఆర్డీవో, రిటర్నింగ్ ఆఫీసర్ రమేశ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రూ.3 వేల ఫైన్
రైల్వేస్ యాక్ట్ సెక్షన్174(a) ప్రకారం వినయ్ భాస్కర్‌ను దోషిగా తేల్చుతూ 2018 సీసీ నెంబర్ 81 కేసులో స్పెషల్ సెషన్స్ జడ్జీ రూ.1,000 ఫైన్ వేసినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారని, ఆయన ఫైన్రూపంలో రూ.3 వేలు కట్టారని లేఖలో తెలిపారు. కానీ వినయ్ భాస్కర్ సమర్పించిన ఫామ్ నెంబర్ 26 ఐదో పేజీలో రూ.వెయ్యి మాత్రమే చెల్చించినట్లు తెలిపారన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు అందించినందుకు వినయ్ భాస్కర్ నామినేషన్ తిరస్కరించాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును రిటర్నింగ్ ఆఫీసర్ రమేశ్‌కు అందించారు. కాగా అధికారులు దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారోనని నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, వరంగల్