Warangal News : దాస్యం వినయ్ భాస్కర్ నా ఇంటిని కబ్జా చేశారు, ఎమ్మెల్యేపై పోటీకి దిగిన 72 ఏళ్ల వృద్ధుడు
Warangal News : బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్, ఆయన అనుచరులు తన ఇంటిని కబ్జా చేశారని 72 ఏళ్లు వృద్ధుడు ఆరోపిస్తున్నారు. తన నిరసన తెలిపేందుకు వినయ్ భాస్కర్ పై ఆ వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Warangal News : తన ఇంటిని కబ్జా చేశారనే ఆవేదనతో 72 ఏళ్ల వృద్ధుడు ఏకంగా ఎమ్మెల్యేపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తన ఇంటిని కబ్జా చేసి తనకు అన్యాయం చేశారని, అందుకే కడుపు రగిలి పోటీలో చేస్తున్నట్లు వృద్ధుడు చెబుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు చేస్తూ సోమవారం వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం నిర్వహించగా.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. బాధితులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల ఎస్సీ కాలనీకి చెందిన గుర్రం జక్కయ్య, శాంతమ్మ దంపతులు వరంగల్ నగరంలోని పోచమ్మకుంటలో కొంత స్థలాన్ని కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకున్నారు. 2020లో ఇల్లు పూర్తి కాగా.. అందులో దాదాపు నెల రోజుల పాటు ఉన్నారు.
ఆ తరువాత కొద్దిరోజులకే వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తగా.. వరద నీరు తగ్గే వరకు వేరే చోటుకు వెళ్లి తలదాచుకున్నారు. ఆ తరువాత తిరిగి వచ్చి చూసే సరికి ఇల్లును ఇతరులు ఆక్రమించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి కబ్జాకు కారణం ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులే కారకులని పేర్కొంటూ హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా.. అప్పుడు సీఐగా ఉన్న పత్తిపాక దయాకర్ పెద్దగా పట్టించుకోలేదు. కబ్జా వెనుక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారని, అందుకే కేసును నిర్లక్ష్యం చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అప్పట్లో సీఐగా పని చేసిన దయాకర్ భూదందా ఆరోపణలతోనే సస్పెండ్ కాగా.. అందులో ఈ ఇష్యూ కూడా ఒకటని బాధితులు చెబుతున్నారు.
నెల రోజులు కూడా ఉండలేదు
కష్టపడి కట్టుకున్న తన ఇంట్లో తాను కనీసం నెల రోజులు కూడా ఉండనేలేదని, ఇంతలోనే ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జా చేశారని 72 ఏళ్ల వృద్ధుడు, ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రం జక్కయ్య ఆరోపించారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేపై పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం రెండు వాహనాలతో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు తన ఇంటిని కబ్జా చేశారని, పోలీసులు కూడా వారికే సహకరించారని ఆరోపిస్తూ వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి సిటీలో ప్రచారం చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు పోటీలో ఉన్న అభ్యర్థులు, తమ ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు చేసేందుకు కొన్ని పరిమితులున్నాయి.
దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు ఆ రెండు వాహనాలను స్టేషన్‌కు తరలించారు. వినయ్ భాస్కర్‌పై ఆరోపణలు చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సందర్భంగా జక్కయ్య మాట్లాడుతూ తన ఇంటిని కబ్జా చేశారని ఎంత వేడుకున్నా తమను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కడుపు రగిలిపోయి నేరుగా ఎమ్మెల్యేపై పోటీకి నిలబడినట్లు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేపై పోటీకి నామినేషన్ వేశానని, తన ఇల్లు తన సొంతమయ్యే వరకు కొట్లాడుతానని స్పష్టం చేశారు. ఇప్పటికే వినయ్ భాస్కర్ పై పలుమార్లు కబ్జా ఆరోపణలు రాగా ఇంకో మూడు రోజుల్లో ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో మరోసారి కబ్జా ఆరోపణలు తెరమీదకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)