Telangana Elections 2023 : 'తూర్పు'లో ఇంట్రెస్టింగ్ సీన్... బీఆర్​ఎస్​ ఆఫీసులోకి కొండా సురేఖ-warangal east election news konda surekha went to brs party office ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Elections 2023 : 'తూర్పు'లో ఇంట్రెస్టింగ్ సీన్... బీఆర్​ఎస్​ ఆఫీసులోకి కొండా సురేఖ

Telangana Elections 2023 : 'తూర్పు'లో ఇంట్రెస్టింగ్ సీన్... బీఆర్​ఎస్​ ఆఫీసులోకి కొండా సురేఖ

HT Telugu Desk HT Telugu
Nov 22, 2023 04:52 PM IST

Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల వేళ ఓరుగల్లు రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇక తూర్పులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న వేళ… కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ బీఆర్ఎస్ ఆఫీస్ కి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ ఆఫీసులో కొండా సురేఖ
బీఆర్ఎస్ ఆఫీసులో కొండా సురేఖ

Warangal East Assembly Constituency: వరంగల్​ తూర్పు నియోజకవర్గంలో జరిగే ఘటనలు హాట్​ టాపిక్​ గా మారుతున్నాయి. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య దాడులు, పార్టీలు మారుతున్న లీడర్లు, అగ్రనేతల పర్యటనలతో నిత్యం ఏదో ఒకరకంగా నియోజకవర్గం చర్చల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్ తూర్పులో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్​ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ.. సడెన్​ గా బీఆర్​ఎస్​ ఆఫీస్​లో కనిపించారు. ఇప్పటికే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కార్యకర్తలు, నేతలు బాహాబాహీకి దిగుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండగా.. కొండా సురేఖ అధికార పార్టీ ఆఫీస్​ లో ప్రత్యక్షం కావడంతో అందరూ షాకయ్యారు. ప్రచారంలో భాగంగా వరంగల్ పెరుకవాడలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​ లోకి వెళ్లి అక్కడున్న వాళ్లను కొండా సురేఖ ఓట్లడగగా.. ఆమె వెళ్లిన కారణం తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు.

బీఆర్​ఎస్​ వర్సెస్​ కాంగ్రెస్​

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. బీఆర్​ఎస్​ నుంచి సిట్టింగ్​ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​, కాంగ్రెస్​ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్​ రావు పోటీలో ఉన్నా.. ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపే పరిస్థితిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొద్దిరోజులుగా నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ వర్సెస్​ కాంగ్రెస్​ అన్నట్టుగా యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య నాయకులు, కార్యకర్తల ఫిరాయింపులు పెరిగిపోయాయి.

నియోజకవర్గంలో కీలకమైన గోపాల నవీన్​ రాజ్​ బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​ లోకి జంప్​ అవగా.. కొంతమంది యూత్​ నాయకులు కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​ లోకి చేరారు. ఎన్నికల వేడి పెరిగిపోవడంతో ఇరుపార్టీల మధ్య భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొండా సురేఖ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో బీఆర్​ఎస్​ ఆఫీస్​ లోకి అడుగు పెట్టడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మళ్లీ అక్కడేమైనా గొడవ జరుగుతుందేమోననే కంగారు కూడా అందరిలో కనిపించింది. కాగా అందరి మధ్య బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీస్​లోకి వెళ్లిన కొండా సురేఖ అక్కడున్నవాళ్లను ఓట్లు అభ్యర్థించి, చిరునవ్వుతో వెనకకు తిరిగి వచ్చింది. కాగా పార్టీలతో సంబంధం లేకుండా జనాల్లోకి వెళ్తున్నామని, ఈసారి విజయం తమనే వరిస్తుందని కొండా దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టింగ్ : వరంగల్ ప్రతినిధి

WhatsApp channel