Vegetable Prices Hike : హైదరాబాద్‌లో అమాంతం పెరిగిన కూరగాయల రేట్లు - అదే బాటలో మాంసం ధరలు..!-vegetable prices have increased in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vegetable Prices Hike : హైదరాబాద్‌లో అమాంతం పెరిగిన కూరగాయల రేట్లు - అదే బాటలో మాంసం ధరలు..!

Vegetable Prices Hike : హైదరాబాద్‌లో అమాంతం పెరిగిన కూరగాయల రేట్లు - అదే బాటలో మాంసం ధరలు..!

HT Telugu Desk HT Telugu
May 30, 2024 03:26 PM IST

Vegetable Prices Hike in Hyderabad : హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఉత్పత్తి తగ్గటంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రేట్లు అమాంతం పైకి చేరాయి. మరోవైపు చికెన్, మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి.

హైదరాబాద్ లో పెరిగిన కూరగాయల ధరలు
హైదరాబాద్ లో పెరిగిన కూరగాయల ధరలు

Vegetable Prices Hike in Hyderabad : హైదరాబాద్ నగరంలో  కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్కెట్ కు ఐదు వందలు తీసుకెళ్లినా కనీసం సంచి నిండా కూరగాయలు రావట్లేదని సామాన్యులు అంటున్నారు. 

ఒక్క కూరగాయల ధరలు మాత్రమే కాదు పప్పు,ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు పెరిగిన ధరలతో సమతమతమవుతున్నారు.

ధరలకు రెక్కలు...

గత కొన్నిరోజులుగా పెరిపోతున్న ఎండ తీవ్రతతో కూరగాయల ధరలు పోటీ పడుతూ అమాంతం పెరిగిపోయాయి.  వారం రోజుల క్రితం శేరిలింగంపల్లి కూరగాయల మార్కెట్ లో రూ.20 కిలో ఉన్న టమాటా ఇప్పుడు ఏకంగా రూ.50 కు చేరింది.

బీరకాయ కిలో రూ.100 కు చేరింది. మార్కెట్ ,దుకాణాల్లో ఎప్పుడు తక్కువ ధరకే లభించే ఆలుగడ్డ కిలో రూ.50 కి చేరింది. కిలో వంకాయ రూ.80 కి చేరింది. పచ్చి మిర్చి కిలో రూ.100, బెండకాయ, దొండకాయ కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు.ఇక కేజీ బీన్స్ రూ.120 వరకు పలుకుతుంది. క్యాప్సికమ్ కేజీ రూ.80,చిక్కుడు కాయ కిలో రూ.80, సొరకాయ సైజ్ ను బట్టి రూ.30 నుంచి 50 వరకు అమ్ముతున్నారు. 

కొత్తిమీర పది రూపాయలకు ఒక్కటే చిన్న కట్ట ఇస్తున్నారు. బచ్చలికూర రూ.30 కు రెండు కట్టలు, తోటకూర రూ.20 కి రెండు చిన్న కట్టలు విక్రయిస్తారు. వేసవి కాలం కావడంతో ఇటు నిమ్మకాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రూ.20 ఇస్తే మూడు నుంచి నాలుగు నిమ్మకాయల ఇస్తున్నారు. 

అల్లం, వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ అల్లం రూ. 200గా ఉంది. వెల్లిగడ్డ కేజీ ధర రూ. రూ.320వరకు పలుకుతుంది. ఇటు చింతపండు కూడా కేజీ రూ.120 నుంచి రూ.140 కి చేరింది.

పెరిగిన మాంసం ధరలు..

మరోవైపు చికెన్, మటన్ ధరలు కూడా పెరిగాయి. సాధారణంగా ఎండల తీవ్రతకు చికెన్, మటన్ ధరలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం వాటి ధరలు భిన్నంగా ఉన్నాయి. బుధవారం నాటికి  స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర ఏకంగా రూ.280 కి చేరింది. ఇటు మటన్ ధరలు కూడా పెరిగాయి గతంలో కేజీ రూ.800 ఉండగా ఇప్పుడు కేజీ మటన్ రూ.1100 చేరింది

హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే ఎక్కువగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో అయితే 43 ఉష్ణోగ్రతల ఎండ నమోదు అయింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇదే స్థాయిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.ఈ ఎఫెక్ట్ తో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.దీంతో అన్నదాతలు వేసిన పంటలకు సరైన దిగుబడి రాలేదు.దిగుబడి వచ్చినా ఈ ఎండలకు కూరగాయలు వెంటనే పాడవుతున్నాయి. దీంతో మార్కెట్ లో ఆయా కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో కూరగాయలకు భాగా డిమాండ్ పెరిగింది.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.

 

Whats_app_banner