Dengue Cases : డెంగీ పంజా.. హైరిస్క్ జోన్ లో 'ఖమ్మం' జిల్లా..
Dengue Cases in Khammam : ఖమ్మం జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తోంది.
Dengue Fever Cases in Khammam : ఖమ్మం జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. డెంగీ వ్యాప్తితో రాష్ట్రంలోని ఐదు జిల్లాలు హైరిస్క్ జోన్లో ఉన్నట్లు గుర్తించగా.. జాబితాలో ఖమ్మం జిల్లా పేరు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉన్నతాధికారుల సూచనలతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జ్వరాలు జనాన్ని మంచాన పడేస్తున్నాయి. కాగా డెంగీ కేసుల నమోదు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో నివాస ప్రాంతాలు మురుగు నీరుతో నిండిపోయాయి. దీంతో దోమల వ్యాప్తి బాగా పెరిగిపోయింది. ఈ ఫలితంగానే ప్రజలు డెంగీ బారిన పడుతున్నారు.
ఆస్పత్రులు కిటకిట..
జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితో పాటు జిల్లాలో రెండు ఏరియా ఆస్పత్రులు, నాలుగు సీహెచ్ సీలు, 26 పీహెచ్సీలు, 224 సబ్సెంటర్లు, 161 పల్లె దవాఖానాలు ఉన్నాయి. జ్వరాలతో బాధపడుతూ వచ్చిన వారితో ఇవన్నీ కిటకిటలాడుతున్నాయి. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా క్యూ కడుతున్నారు. డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కూడా విజృం భిస్తుండడంతో వైద్య ఆరోగ్యశాఖ ర్యాపిడ్ యాక్షన్ టీమ్ లను ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదైనా వెంటనే అదుపులోకి వస్తున్నాయి.
ప్రతియేటా ఇదే పరిస్థితి..
వర్షాకాల సీజన్లో ఏటా జిల్లాను డెంగీ వణికిస్తోంది. ఈ ఏడాది జూలై నుంచి డెంగీతో బాధపడు తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. 2021లో 944 మందికి, 2022 ఏడాదిలో 711 మందికి, 2023లో 530 మందికి అధికారిక లెక్కల ప్రకారం డెంగీ సోకింది. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు ఇంకా ఎక్కువ మందే ఉంటారని అంచనా. ఈ గణాంకాల ఆధారంగా గతంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించి స్థానికులకు అవగాహన కల్పించడమే కాక వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది.
ఈ ఏడాది జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 12,621 మంది నుంచి శాంపిళ్లు సేకరించగా.. 306 కేసులు నమోదయ్యాయి. సీజన్తో సంబంధం లేకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో కూడా నెలకు 30 నుంచి 40 కేసులు నమోదవడం గమనార్హం. మే, జూన్లో కాస్త తగ్గినా జూలైలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. జూలైలో 109 కేసులు నమోదయ్యాయి.
రాజధాని తర్వాత ఖమ్మమే..
డెంగీ కేసుల విషయంలో జిల్లా హైరిస్క్ జోన్లో ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఖమ్మం జిల్లా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి అత్యధికంగా తెలంగాణాలో అత్యధికంగా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపధ్యంలో రాష్ట్రంలో హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు.
ఇందులో ఖమ్మం జిల్లా కూడా ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా నమోదైన డెంగీ కేసుల ఆధారంగా హైరిస్క్ జోన్లను గుర్తించి పరీక్షలు పెంచడంతో పాటు తరచుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీనే ఆరు కేసులు నమోద య్యాయి. ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతుండగా ఈ ఏడాది జనవరి నుంచే డెంగీ పంజా విసిరింది.
ఆరోగ్య శాఖ అప్రమత్తం..
తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే కేవలం వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తేనే సరిపోదు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తేనే డెంగీ వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతుంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి సంస్థలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా చూడాలి. ఫ్రెడే-డ్రైడే వంటి కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. అటు వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖలు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తూ ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తే డెంగీ బారిన పడకుండా కాపాడినట్లవుతుంది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం