బొప్పాయి, బొప్పాసి లేదా పాపిటా, మరికొన్ని చోట్ల కొప్పడి పండు అని కూడా పిలుస్తారు. పేర్లు ఎన్ని ఉన్నా ఈ పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం కారికా బొప్పాయి. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది, మన దేశంలో అత్యంత ఇష్టపడే పండ్లలో బొప్పాయి ఒకటి.
సీజనల్‌గా లభించే ఏ పండ్లయినా ఆరోగ్యానికి మంచిదే, అయితే బొప్పాయి అదనపు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీని పండ్లు, ఆకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి మొక్కలోని ప్రతి భాగం యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా బొప్పాయి లభ్యమవుతుంది.
ఇటీవల కాలంలో బొప్పాయి పండు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. డెంగీ జ్వరం బారినపడిన వారికి వైద్యులు బొప్పాయి తినాల్సిందిగా సూచిస్తున్నారు. డెంగీ జ్వరానికి ఇప్పటివరకు నిర్ధిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా వారి రక్తంలో ప్లేట్‌లెట్ కణాల సంఖ్య పడిపోతుంది. అయితే బొప్పాయి పండు తినడం ద్వారా ప్లేట్‌లెట్‌ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే బొప్పాయి ఆకు రసాన్ని కూడా డెంగీ లక్షణాలకు చికిత్సగా అందించవచ్చు. బొప్పాయి ఆకు రసం తీసుకున్నవారి రక్తంలో ప్లేట్‌లెట్ల స్థాయి విపరీతంగా పెరిగినట్లు పలు అధ్యయనాలు నిరూపించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బొప్పాయి ఆకు రసం అందరి శరీరానికి పడకపోవచ్చు అలాంటి సమయంలో బొప్పాయి పండు తినడం మేలు.
సంబంధిత కథనం