Warangal : విజృంభిస్తున్న విష జ్వరాలు - డెంగీతో తల్లితో పాటు గర్భంలో ఉన్న కవలలు మృతి!-dengue cases are increasing and in warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : విజృంభిస్తున్న విష జ్వరాలు - డెంగీతో తల్లితో పాటు గర్భంలో ఉన్న కవలలు మృతి!

Warangal : విజృంభిస్తున్న విష జ్వరాలు - డెంగీతో తల్లితో పాటు గర్భంలో ఉన్న కవలలు మృతి!

HT Telugu Desk HT Telugu
Aug 02, 2024 03:27 PM IST

Dengue cases in Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హన్మకొండ జిల్లా పరిధిలో డెంగీతో గర్భిణి మహిళ మృతి చెందింది. గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు కూడా ప్రాణాలు విడిచారు.

వరంగల్ జిల్లాలో డెంగ్యూ కేసులు
వరంగల్ జిల్లాలో డెంగ్యూ కేసులు (image source from unsplash.com)

హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తుండగా, డెంగీతో ఓ గర్భిణి, గర్భంలో ఉన్న కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. గ్రామస్థులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి శిరీష(29)ను కొంతకాలం కిందట హనుమకొండకు చెందిన శ్రీకాంత్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తరువాత శిరీష గర్భం దాల్చింది. ఇప్పటికే శిరీషకు తొమ్మిది నెలలు నిండగా, ఈ మధ్య ఆమె జ్వరం బారిన పడింది. దీంతో భర్త శ్రీకాంత్ ఆమెను హనుమకొండలో ఉన్న కల్యాణి హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశాడు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు డెంగీ జ్వరం సోకినట్లు నిర్ధారించారు. పరిస్థితి తీవ్రం కావడంతో మూడు రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. 

ఇంతవరకు బాగానే ఉండగా, మూడు రోజుల నుంచి రక్త కణాలు తగ్గిపోతుండటంతో శిరీష ఆరోగ్యం క్షిణించింది. దీంతో ఆమెతో పాటు గర్భంలో ఉన్న కవల పిల్లలను కాపాడేందుకు అక్కడి డాక్టర్లు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ రక్త కణాల సంఖ్య భారీగా తగ్గిపోవడం, పరిస్థితి విషమంగా మారడంతో గురువారం రాత్రి శిరీష సహా గర్భంలో ఉన్న ఇద్దరు కవల పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో గట్ల కనపర్తి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుము కున్నాయి.

ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనాలు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల ముసురు వానలు కురవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపించింది. దోమల వ్యాప్తి పెరిగిపోవడంతో జనాలు జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో జనాలు జ్వరాలతో సతమతం అవుతున్నారు. హనుమకొండ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

 కమలాపూర్ మండలంలోని భీంపెల్లి గ్రామంలో ఇప్పటికే చాలామంది జ్వరాలతో మంచం పట్టగా, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా జ్వరాల బెడద ఇదే తీరుగా ఉంది. దీంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్న పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. 

నిత్యం వరంగల్ ఎంజీఎంలో 2500 కు పైగా ఓపీ నమోదు అవుతుండగా, అందులో చాలా వరకు జ్వర బాధితులే ఉంటున్నారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. జులై నెలలో మొత్తంగా 1156 మంది పేషెంట్లు జ్వరంతో బాధ పడుతూ ఆసుపత్రికి రాగా, అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి 14 మందికి మలేరియా, 10 మంది డెంగీ జ్వరాల బారిన పడినట్లు నిర్ధారించారు. 

వాతావారణ పరిస్థితులు మారుతుండటం, రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఎంజీఎంలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు ఏర్పాటు చేసి, జ్వరంతో వచ్చే బాధితులకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఇదిలాఉంటే విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నుంచి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner