TS Graduate MLC Election : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈసీ కసరత్తు - ఓటరు లిస్ట్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే-the election process has started for the graduates mlc seat in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Graduate Mlc Election : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈసీ కసరత్తు - ఓటరు లిస్ట్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

TS Graduate MLC Election : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈసీ కసరత్తు - ఓటరు లిస్ట్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 31, 2023 05:37 AM IST

Telangana MLC Election News: వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు

Telangana MLC Election News: తెలంగాణలో మరో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ దిశగా ఎన్నికల సంఘం... ప్రక్రియను ప్రారంభించింది.ఈ నియోజకవర్గానికి చెందిన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఆదేశించాలు ఇచ్చింది ఈసీ. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్‌ను వెల్లడించగా... ఓటర్ల నమోదు ప్రక్రియకు శనివారం పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 6కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని... 24వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించాలని పేర్కొంది. ఏప్రిల్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది.

కీలకమైన తేదీలు:

కొత్త ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ - 30, డిసెంబర్, 2023.

దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి, 6, 2024.

ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ - 21, ఫిబ్రవరి, 2024.

డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ - 24, ఫిబ్రవరి, 2024.

అభ్యంతరాలకు గడువు - 13, మార్చి, 2024.

తుది ఓటర్ల జాబితా - 4, ఏప్రిల్, 2024.

పల్లా రాజీనామాతో ఎన్నికలు...

వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్త ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా... చివరకు పల్లా విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.

ఇక గతంలో ఈస్థానం నుంచి అత్యంత కష్టం మీద గెలిచిన బీఆర్ఎస్.... మరోసారి గెలవటం అతిపెద్ద సవాల్ గా మారనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఈ స్థానం నుంచి ఎవరు అభ్యర్థులుగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న.... మరోసారి ఇక్కడ్నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారనేది చూడాలి...!

NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

Whats_app_banner