Jangaon Politics : నన్ను ఓడించలేక నా ఇంట్లో చిచ్చు పెట్టారు, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి ఫైర్-jangaon brs internal fight for mla ticket mla muthireddy vs mlc palla rajeshwar reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jangaon Politics : నన్ను ఓడించలేక నా ఇంట్లో చిచ్చు పెట్టారు, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి ఫైర్

Jangaon Politics : నన్ను ఓడించలేక నా ఇంట్లో చిచ్చు పెట్టారు, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి ఫైర్

Bandaru Satyaprasad HT Telugu
Aug 19, 2023 07:54 PM IST

Jangaon Politics : జనగామ పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్ నేతల మధ్య టికెట్ లొల్లి మొదలైంది. ఈసారి టికెట్ నాకే అంటూ పల్లా ప్రచారం మొదలెట్టడంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రంగంలోకి దిగారు. పల్లాపై విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Jangaon Politics : జనగామ బీఆర్ఎస్ టికెట్ వార్ మొదలైంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. తన నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఏం పనంటూ ముత్తిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్ తనకే టికెట్ కేటాయించారని పల్లా అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ పద్ధతిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్లా జనగామ ప్రజలను ఏనాడూ ఆదుకోలేన్నారు. తనను ఓడించలేక తన ఇంట్లో చిచ్చు పెట్టారని ముత్తిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈసారి జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పల్లా ఇంట్లో కాంగ్రెస్ నేత

జనగామలో రాజకీయాలు మారుతున్నాయి. పల్లా ఎంట్రీతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫైర్ అవుతున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చిచ్చుపెట్టారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆరోపించారు. తన కూతురితో తప్పుడు కేసులో పెట్టించింది పల్లానే అన్నారు. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉంటున్నారని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్ మేట్స్ అన్నారు. ఇకపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు జనగామలో సాగవన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పల్లా డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీగా పల్లా జనగామకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లా అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తొలి జాబితాలో జనగామ టికెట్ ప్రకటించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు.

పల్లా అబద్దపు ప్రచారం

సీఎం కేసీఆర్ అప్పుడే టికెట్లు కేటాయించేశారని, జనగామ టికెట్ తనకే అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి అబద్దపు ప్రచారం చేస్తున్నారని ముత్తిరెడ్డి మండిపడ్డారు. తన అనుచరులకు ఫోన్ చేసి సపోర్టు చేయాలని అడగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం పాల్గొన్న తాను, జనగామ ప్రజలకు ఎంతో చేశానన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంపై కన్నేశారని, టికెట్ తనకే కేటాయించారని బీఆర్ఎస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ కేటాయించొద్దని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మద్దతుగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముత్తిరెడ్డి మద్దతుదారులు భారీగా చేరుకుని పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Whats_app_banner