AP MLC Results: వైసీపీకి షాక్.. 2 పట్టభద్రుల స్థానాల్లో TDP విజయం.. మరోచోట హోరాహోరీ!
Ap Graduate Mlc Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చింది టీడీపీ. ఇప్పటికే రెండు స్థానాల్లో విజయం సాధించగా... మరోస్థానంలో హోరాహోరీగా దూసుకెళ్తోంది.
Ap Graduate Mlc Election Results Updates 2023: ఏపీలో జరుగుతున్న గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. ఏకంగా రెండు సీట్లలో గెలిచిన తెలుగుదేశం పార్టీ... అధికార వైసీపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరో సీటులో నువ్వా - నేనా అన్నట్లు పరిస్థితి నెలకొంది. తాజా ఫలితాలపై టీడీపీ శ్రేణలు జోష్ లో ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ముఖ్య నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడో సీటు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
2 సీట్లు టీడీపీవే...
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విక్టరీ కొట్టింది. సత్తా చాటింది. ఉత్తరాంధ్రకు సంంబధించి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో గెలుపొందారు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల్లోటీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు పోలయ్యాయి. ఇక వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు వచ్చాయి. ఇక గతంలో ఇదే సీటు నుంచి గెలిచిన బీజేపీ పీవీఎన్ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు పోలయ్యాయి. చిరంజీవిరావు విజయం సాధించేందుకు ఇంకా 11,551 ఓట్లు కావాల్సి ఉండటంతో అధికారులు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం అత్యంత ఆసక్తిని రేపింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయసాధించారు. ఇక్కడ కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మెజారిటీ సాధించారు.
మరోవైపు పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూల్) ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు హోరాహోరీగా కొనసాగుతోంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ కాగా... టీడీపీ క్రమంగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. మొత్తం 2,45,576 ఓట్లు పోలవగా ఇందులో వైసీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి 95,969, టీడీపీ బలపరిచిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో.. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కంటే వైసీపీ అభ్యర్థి కేవలం 1792 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శనివారం సాయంత్రం లోపు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సీటు కూడా తామే గెలుస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం