Visakhapatnam Loss: విశాఖలో వైసీపీ ఓటమికి కారణాలేమిటి…?
Visakhapatnam Loss: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ స్థానాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓటమికి కారణాలేమిటని చర్చించుకుంటున్నారు.
Visakhapatnam Loss: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటానికి కారణం ఏమిటనే చర్చ ఏపీలో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉపాధ్యాయ, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక్లలో గ్రాడ్యుయేట్ నియోజక వర్గాల్లో మాత్రం వైసీపీ బోల్తా పడింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణాన్ని చేస్తామని ప్రకటించినా ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ తన సమీప ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడం వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ వెనుకంజకు చాలా కారణాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపికైన సీతంరాజు నిన్న మొన్నటి వరకు ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అదే ఆయన కొంపముంచినట్లు విశాఖ నేతలు చెబుతున్నారు.
వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, అభ్యర్ధుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు, ఉత్తరాంధ్ర బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించడం, అభ్యర్థి విజయసాయిరెడ్డి మనిషి కావడంతో పాటు విశాఖపట్నంలో టీడీపీకి మొదటి నుంచి ఉన్న స్థాన బలం కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయని చెబుతున్నారు.
వైసీపీ అభ్యర్థిగా ఉన్న సీతంరాజు సుధాకర్‌తో మిగిలిన నాయకులకు ఉన్న విభేదాలు, విశాఖలోని పార్టీ నేతలతో ఆయనకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఆ పార్టీ పెద్దలు కూడా గెలుపు అవకాశాలపై మొదటి నుంచి సందేహంతోనే ఉన్నారని చెబుతున్నారు.
సీతంరాజు సుధాకర్ అభ్యర్థిత్వాన్ని స్థానికంగా మద్దతు లభించకపోవడంతో పాటు విశాఖలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండటం కూడా ఆ పార్టీకి కలిసొచ్చిందని చెబుతున్నాారు. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైఎస్.విజయమ్మను సైతం ఓడించిన సంగతి గుర్తు చేస్తున్నారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాలో విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించడం, ఆయన అండతో సీతంరాజు సుధాకర్ వంటి నాయకులు చెలరేగిపోవడం కూడా పార్టీకి ఎదురుగాలి వీయడానికి కారణమని చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ టిక్కెట్ సుధాకర్‌కు వచ్చినా, అతని గెలుపు విషయంలో సుబ్బారెడ్డి పెద్దగా శ్రద్ధ పెట్టలేదని ప్రచారం ఉంది.
విశాఖ సౌత్‌కు చెందిన సీతంరాజు సుధాకర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. 2019లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించడంతో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని సీతంరాజు భావించారు. స్టీల్ ప్లాంట్‌కు అనుబంధ పరిశ్రమలు నిర్వహించే సుధాకర్ ఆర్ధికంగా బలంగా ఉండటం, సాయిరెడ్డి ఆశీస్సులు ఉండటంతో టిక్కెట్ ఖాయమని భావించారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి, వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న వాసుపల్లి గణేష్‌తో తీవ్ర విభేదాలు ఉన్నాయి. దీంతో సుధాకర్‌ను మండలికి పంపించి సయోధ్య కుదర్చాలని సిఎం భావించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో ఈ అంచనాలు తలకిందులు కావడంతో వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో టీడీపీ సాధించిన విజయం ఆ పార్టీకి పెద్ద ఉత్సహాన్నిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానులు, విశాఖకు రాజధాని తరలింపు వంటి నిర్ణయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణిస్తున్నారు. అటు రాయలసీమలో కూడా టీడీపీ విజయం సాధిస్తే నైతికంగా తమకు విజయం దక్కినట్టేనని చెబుతున్నారు.