TG DSC Exams : డీఎస్సీ అభ్యర్థుల్లో గందరగోళం, ఒక జిల్లాకు అప్లై చేస్తే హాల్ టికెట్లో మరో జిల్లా- విద్యాశాఖ ఏమందంటే?
TG DSC Exams : ఈ నెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది. అయితే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.
TG DSC Exams : తెలంగాణ డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై వాయిదాలు కుదరవని పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇదే చివరి డీఎస్సీ కాదని, మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసింది. ఇప్పటికే 2.05 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే డీఎస్సీ హాల్ టికెట్లు చూసి అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. హాల్ టికెట్లు తప్పుల తడకగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. తప్పులను వెంటనే సరిచేయాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు.
అభ్యర్థుల్లో గందరగోళం
డీఎస్సీ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న కొందరు అభ్యర్థులకు ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే... ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష కేంద్రం హాల్ టికెట్లో దర్శనమిచ్చింది. దీంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయం తెలుసుతున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేసింది. ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే ఒకే పరీక్షా కేంద్రంలో రాసుకోవచ్చని తెలిపింది. అలాంటి వారికి మళ్లీ హాల్ టికెట్లను జారీ చేస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు హాల్ టికెట్లలో చూపడంతో అభ్యర్థులు షాక్ తిన్నారు. వీటిని ఎలా సరిచేసుకోవాలో అర్థం కాక తికమకపడుతున్నారు. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటా మరో జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు చూపిస్తుందని పలు అభ్యర్థులు అంటున్నారు. దీనిపై అభ్యర్థులు హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన విద్యాశాఖ అధికారులు.... ఫిర్యాదులపై విచారణ జరిపి పొరపాట్ల సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
జులై 18-ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
తెలంగాణలో మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణయించిన తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి ఆన్ లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోనివారు schooledu.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకువచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు.
సంబంధిత కథనం