Bhatti Vikramarka On New DSC : 6 వేల పోస్టులతో త్వరలో మరో డీఎస్సీ, అన్నిసార్లు పరీక్షల వాయిదా సరికాదు- భట్టి విక్రమార్క
Bhatti Vikramarka On New DSC : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల మరో గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ వాయిదాపై నిరసనల నేపథ్యంలో మరో డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మరో 5-6 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
Bhatti Vikramarka On New DSC : పరీక్షల వాయిదా, నిరుద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఇదే చివరి డీఎస్సీ కాదని, మరిన్ని తీస్తామన్నారు. త్వరలో 5 -6 వేల పోస్టులతో మరో డీఎస్సీ తీస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి మూడు నెలల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామన్నారు. మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం సాధించింది యువతకు ఉద్యోగాల కోసం అన్నారు. అధికారం చేపట్టగానే 16 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామన్నారు. ముందుగా 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మరిన్ని పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అలాగే 19,717 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 34 వేల మంది టీచర్లను బదిలీ చేశామన్నారు.
త్వరగా ఉద్యోగాల భర్తీ మా లక్ష్యం
"విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. 19 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 11న హాల్ టికెట్లు విడుదల చేశాం. ఇప్పటికే 2 లక్షల 5 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఉద్యోగార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వాళ్లు 2 లక్షల 79 వేల మంది అప్లై చేసుకోగా 2.05 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. గత ఏడాది నుంచి విద్యార్థులు డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా పరీక్షలు ఆలస్యం చేయడం సరికాదని జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. అలాగే గత పదేళ్లలో గ్రూప్-1 నిర్వహించలేదు. గ్రూప్ -2 ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదు. ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. " - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మరిన్ని నోటిఫికేషన్లు
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కొంత మంది నిరసనలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్-1 పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తుచేశారు. గతంలో సీఎల్పీ నేతగా తాను ఎన్నోసార్లు గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశానన్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు విడుదల చేశామన్నారు. గ్రూప్-1 మెయిన్స్ తేదీలు కూడా ప్రకటించామన్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-2 నోటిఫికేషన్ ఇచ్చి మూడు సార్లు వాయిదా వేశారు. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా గ్రూప్ -2 నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అలాగే హాస్టల్ వెల్ఫేర్‌కి సంబంధించి 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించామన్నారు. పదేళ్లు నిరుద్యోగుల బాధలు చూసి వాళ్లకు తొందరగా ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నామన్నారు. అయితే కొందరు మాకు ఒక్కసారే ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తున్నారు, ప్రిపరేషన్ కు సమయం లేదని పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారన్నారు. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని, ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.
సంబంధిత కథనం