TS Mega DSC 2024 Updates : తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే-telangana mega dsc notification 2024 district wise post details check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Mega Dsc 2024 Updates : తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే

TS Mega DSC 2024 Updates : తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 29, 2024 05:45 PM IST

TS Mega DSC Notification 2024 Updates: తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా… 11వేల 62 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూడండి….

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్

Telangana Mega DSC Notification 2024 Updates: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్(Telangana Mega DSC Notification) ను విడుదల చేసింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వంలో 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయగా… కొత్తగా ఈ నోటిఫికేషన్ ను ప్రకటించింది.

మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2024 మార్చి 4వ తేదీ నంచి పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ‌లో https://schooledu.telangana.gov.in లో నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.

జిల్లాల వారీగా ఖాళీలు:

కొత్తగా విడుదలై డీఎస్సీ నోటిఫికేషన్ లోని ఖాళీలను జిల్లాల వారీగా చూస్తే…. హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా…. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి.ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి.

హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా... ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే...స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా...224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే... 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.

జిల్లాల వారీగా SGT. SAలతో పాటు లాంగ్వేజ్ పండిట్ పోస్టుల వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చెక్ చేసుకోవచ్చు…

అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు వ్రాత పరీక్ష కోసం చెల్లించాల్సిన రుసుము ఒక్కో పోస్ట్‌కు రూ.1000/- చెల్లించాలి. వేర్వేరు పోస్ట్‌లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఒక్కో పోస్ట్‌కు విడిగా రూ. 1000/- రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ప్రతి పోస్ట్‌కు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి. మార్చి4 వ తేదీ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://schooledu.telangana.gov.in ఫీజు చెల్లింపు గేట్‌వే లింక్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ / నెట్-బ్యాంకింగ్ ద్వారా ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఏప్రిల్ 2వ తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయడానికి దశల వారీ విధానాన్ని మార్చి 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. గరిష్ట వయోపరిమితిని 46ఏళ్లుగా పేర్కొన్నారు.

డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 1) మహబూబ్‌నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్గొండ మరియు 11) సంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం