Praja Bhavan : డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా 'ప్రజా భవన్' - ఉత్తర్వులు జారీ
Telangana government News: ప్రజా భవన్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Praja Bhavan: తెలంగాణలో అధికారంలోకి వచ్చినకాంగ్రెస్… ముఖ్యమంత్రి నివాసంగా ఉన్న ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇదే నివాసంలో ప్రజాదర్భార్ ను కూడా నిర్వహిస్తూ వస్తోంది. అయితే తాజాగా… ఈ భవనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను కేటాయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవలే పేరు మార్పు….
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ… ప్రగతి భవన్ ను గడీగా పోల్చింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించింది. అయితే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ సర్కార్… ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. సామాన్య ప్రజలు వచ్చేలా ప్రజా దర్భార్ కేంద్రంగా మార్చారు. మొదటి రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఇక తర్వాత… ప్రతిరోజూ ఒక మంత్రి స్వయంగా… ప్రజాదర్భార్ లో పాల్గొని… ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఇక గత ప్రభుత్వంలో… ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇక్కడ్నుంచి కార్యకలాపాలను నిర్వహించే ఆలోచనలో లేరు. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే… డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్ ను కేటాయించటంతో… ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వినియోగించటం దాదాపు ఖాయమని తెలుస్తోంది.