TG Degree spot admissions : రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు.. పూర్తి వివరాలు ఇవే
TG Degree spot admissions : డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు.. తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. రేపట్నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం.. స్పాట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. ఈనెల 25 నుంచి 27 వరకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశమిచ్చారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ని సీట్లకు, ప్రైవేట్ ఎయిడ్ కాలేజీల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశామిచ్చినట్టు.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు.
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే పలు విడుతల్లో అడ్మిషన్ ప్రక్రియను నిర్వహించారు. తాజాగా స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు అడ్మిషన్ పొందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
గతేడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది మొత్తం 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా దాదాపు 1,054 కాలేజీల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పించాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను ఆయా డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా భర్తీ చేశారు.
ఇటు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును బోర్డు మరోసారి పొడిగించింది. రూ.500 లేట్ ఫీజుతో.. రెండో విడత అడ్మిషన్ల గడువుకు ఈనెల 30 వరకు అవకాశమిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆలస్య రుసుము తీసుకోరు. కేవలం ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో జనరల్ కోర్సుల్లో 60,525 మంది, వొకేషనల్ కోర్సుల్లో 21,957 మంది చొప్పున మొత్తంగా 82వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని పలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025- 26 విద్యా సంవత్సరానికి గాను.. 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు.. ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చుని అధికారులు సూచించారు.