Medak Sports Festival : ఈనెల 28న మెదక్ లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు, దరఖాస్తులకు సెప్టెంబర్ 25 లాస్ట్ డేట్
Medak Sports Festival : మెదక్ జిల్లాలో ఈ నెల 28న జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న యువతీయువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. కళాకారులు సెప్టెంబర్ 25వ తేదీ లోపు దరఖాస్తు ఫారంను కలెక్టర్ ఆఫీస్ లోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సమర్పించాలి.
Medak Sports Festival : మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 28వ తేదీన జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వై.దామోదర్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలు మెదక్ లోని ఇందిరాగాంధీ స్టేడియం, పీఎన్ఆర్ స్టేడియంలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆసక్తి గల క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలలో 15 నుంచి 28 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చని క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.
పోటీలు
జానపద నృత్యం (బృందం) (Folk Dance Group), జానపద నృత్యం (వ్యక్తిగత/సోలో) (Folk Dance Solo), జానపద గీతాలు (బృందం) (Folk Song Group), జానపద గీతాలు (వ్యక్తిగత / సోలో) (Folk Song Solo), హస్తకళలు, వస్త్రం, ఆర్గో ఉత్పత్తులు, కథా రచన, పెయింటింగ్, డిక్లమేషన్/ఎల్యుకేషన్ వంటి తదితర పోటీలను నిర్వహించనున్నట్లు దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే కళాకారులు సెప్టెంబర్ 25 సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తు ఫారంతో పాటు 2 కలర్ ఫొటోలు, ఆధార్ కార్డు లేదా పుట్టిన తేదీ తెలుపు సర్టిఫికెట్ తో జిల్లా యువజన, క్రీడల కార్యాలయం, కలెక్టర్ ఆఫీస్ లో సమర్పించాలని సూచించారు.
ఈ క్రీడలు ఆయా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో ప్రథమ స్థానంలో గెలుపొందిన ఒక జట్టును, జిల్లా స్థాయిలో ఎంపిక చేసి... రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికైన వారు 2025 జనవరి 12వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనవచ్చని దామోదర్ రెడ్డి తెలిపారు.
ఈ క్రీడా పోటీలలో పాల్గొనే యువతీ యువకులు మెదక్ జిల్లా నివాసులు అయి ఉండాలి. పోటీ నిర్వహించే నాటికీ 15 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. గత మూడు సంవత్సరాల్లో నిర్వహించబడిన జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొన్న యువతీ, యువకులు లేదా గ్రూపులు ఈ పోటీలలో పాల్గొనేందుకు అనర్హులని ఆయన వివరించారు.
సామూహిక ప్రదర్శనలు
జానపద నృత్యం (బృందం) లో 10 మంది మాత్రమే ఉండాలి. ప్రదర్శన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. ప్రదర్శనకు 15 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు.
జానపద నృత్యం (వ్యక్తిగత/సోలో)లో ఒక్కో బృందంలో 5 మంది మాత్రమే ఉండాలి. ప్రదర్శన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండి .. 15 నిమిషాలు సమయంలో పూర్తి చేయాలి.
జానపద గీతాలు (బృందం) ఒక్కో గ్రూపులో 10 మంది మాత్రమే ఉండాలి. ప్రదర్శన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండటంతో పాటు సినిమా పాటలకు అనుమతిలేదు.
జానపద గీతాలు (వ్యక్తిగత/ సోలో) ఒక్కో బృందంలో 5 మంది మాత్రమే ఉండాలి. ప్రదర్శన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. సినిమా పాటలకు అనుమతిలేదు.
దీంతో పాటు గ్రూపు విభాగాల్లో యువతీ యువకులు పాల్గొనవచ్చని వాయిద్య పరికరాలు పోటీలో పాల్గొనే కళాకారులు వెంట తీసుకురావాల్సిందిగా కోరారు. లైవ్ ప్రదర్శన చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ పోటీలలో పాల్గొనే వారికి ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఈ అవకాశాన్ని అర్హులైన కళాకారులు, యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.
సంబంధిత కథనం